బెంగళూరు: ఐదేళ్ల క్రితం...భారత గడ్డపై బోర్డర్–గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియా అనూహ్య విజయంతో టీమిండియాకు షాక్ ఇచ్చింది. పుణేలో స్పిన్ పిచ్ సిద్ధం చేస్తే మనకంటే సమర్థంగా దానిని వాడుకున్న ఆ జట్టు పైచేయి సాధించింది. చివరకు సిరీస్ భారత్ ఖాతాలోనే చేరినా...స్పిన్‌పై ఆసీస్ సన్నద్ధతను ఆ టెస్టు చూపించింది. ఇప్పుడు కూడా సరిగ్గా అదే తరహాలో కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంగారూ బృందం సిద్ధమవుతోంది. అందుకోసం భారత గడ్డపై అడుగు పెట్టగానే ప్రణాళికలు అమలు చేసింది.
తొలి టెస్టు ఈ నెల 9న నాగపూర్‌లో మొదలు కానుండగా... దానికంటే ముందు నాలుగు రోజులు మరో వేదికను తమ ప్రాక్టీస్ కేంద్రంగా ఆస్ట్రేలియా మార్చుకుంది. బెంగళూరు శివార్లలో ఆలూరు మైదానంలో ఆ జట్టు సాధన ప్రారంభించింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లు అవసరం లేదని ముందే తేల్చుకున్న ఆసీస్...నెట్స్‌లోనే భిన్నమైన పిచ్‌లను రెడీ చేసి బరిలోకి దిగింది. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో ఆ జట్టు కోచింగ్ బృందంలో డానియెల్ వెటోరీకి చోటు కల్పించింది.
ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెటోరీ అనుభవం, సూచనలు కచ్చితంగా ఆసీస్‌కు ఉపయోగపడతాయి. గతంలో ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుతో కలిసి పని చేసిన సాన్నిహిత్యంతో పిచ్‌ల ఏర్పాటు, ప్రాక్టీస్ విషయంలో ఆర్‌సీబీ బృందం సహకారాన్ని ఆ్రస్టేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తీసుకున్నాడు. నాలుగు టెస్టుల వేదికల్లో ఎదురయ్యే పిచ్‌లపై ఒక అంచనాతో అదే తరహా పిచ్‌లను సిద్ధం చేసి ఆసీస్ ప్రాక్టీస్ చేస్తోంది. నెమ్మదైన టర్నింగ్ పిచ్, బాగా ట్యాంపరిగ్‌కు సహకరించే పిచ్, భిన్నమైన బౌన్స్‌లను నాగపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో ఆ జట్టు ఎదుర్కోవాల్సి రావచ్చు. సీమ్‌కు అనుకూలించే ధర్మశాల తరహా పచ్చిక ఉన్న పిచ్‌పై కూడా ఆ్రస్టేలియా సాధన మొదలు పెట్టింది.
గతంలో అశ్విన్, జడేజాలను ఎదుర్కొన్న అనుభవం ఉన్నా...టెస్టుల్లో ఇప్పటి వరకు అక్షర్ పటేల్‌ను ఆ్రస్టేలియా ఎదుర్కోలేదు. అందుకే అతని బౌలింగ్ వీడియో ఫుటేజీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బౌలింగ్ శైలిలో అక్షర్‌ను పోలి ఉండే జమ్ము కశ్మీర్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆబిద్ ముస్తాక్ ప్రాక్టీస్‌లో ఆ్రస్టేలియాకు బౌలింగ్ చేస్తున్నాడు. ఆబిద్ ఈ సీజన్ రంజీ ట్రోఫీలో అగ్రశ్రేణి జట్లపై సత్తా చాటి మొత్తం 32 వికెట్లతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.
టాపార్డర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాజా వీసా సమస్య పరిష్కృతమైంది. పాక్‌లో పుట్టిన ఈ క్రికెటర్ చివరి నిమిషంలో వీసా అందకపోవడంతో జట్టు సహచరులతో పాటు భారత్‌కు రాలేకపోయాడు. అయితే ఇప్పుడు అంతా చక్కబడటంతో గురువారం ఖాజా భారత్‌కు బయల్దేరాడు. మరో వైపు వేర్వేరు నగరాల్లో ఉన్న భారత క్రికెటర్లు ఒక్కొక్కరిగా తొలి టెస్టు వేదిక నాగపూర్‌కు చేరుకుంటున్నారు. జట్టు అంతా ఒక్క చోటికి చేరిన తర్వాత టీమ్ ప్రాక్టీస్ ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment