అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ డే అండ్ నైట్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. భారత్ విధించిన 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ నష్టపోకుండా చేధించింది.
కాగా ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లలోనూ భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. 128/5 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 175 పరుగులకే ఆలౌటైంది.
భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి(42) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు శుబ్‌మన్ గిల్(28), రిషబ్ పంత్(28) పరుగులతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 5 వికెట్లతో సత్తాచాటగా.. బోలాండ్ 3, స్టార్క్ రెండు వికెట్లు సాధించారు.
హెడ్ విధ్వంసం..
అంతకుముందు ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్(140) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ తలా నాలుగు వికెట్లు పడగొట్టారు.
ఆరేసిన స్టార్క్..
కాగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కూడా దారుణ ప్రదర్శన కనబరిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 180 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు.
భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్(42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో ఆసీస్ సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: సిరాజ్ కాస్త తగ్గించుకో.. అతడొక లోకల్ హీరో: సునీల్ గవాస్కర్
Comments
Please login to add a commentAdd a comment