
మౌంట్ మాంగనుయ్: సమష్టి ప్రదర్శనతో మరోసారి మెరిసిన ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో వరుసగా 24వ విజయం నమోదు చేసింది. న్యూజిలాండ్ జట్టుతో శనివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో
ఆస్ట్రేలియా 21 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 25 ఓవర్లలో 7 వికెట్లకు
149 పరుగులు చేసింది.
అలీసా హీలీ (39 బంతుల్లో 46; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. న్యూజిలాండ్ బౌలర్ కాస్పెరక్ మూడు వికెట్లు తీసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 25 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 128 పరుగులు చేసి ఓడిపోయింది. అమీ సాటెర్‌వైట్ (20), లియా తహుహు (21 నాటౌట్) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షుట్, వేర్‌హమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.