పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ తరపున అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. గురువారం బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 బాబర్‌కు 124వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను బాబర్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంతకుముందు ఈ రికార్డు పాక్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(123) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మాలిక్ రికార్డును ఆజం బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు 124 టీ20లు ఆడిన బాబర్.. 40.67 సగటుతో 4148 పరుగులు చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. వెలుతురు లేమి కారణంగా నిర్ణీత సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన తొలి టి20ని చివరకు 7 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.
ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మాక్స్‌వెల్19 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టొయినిస్ (7 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పాకిస్తాన్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 7 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 64 పరుగులకు పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో అబ్బాస్ అఫ్రిది (20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment