ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లకు చేదు ఫలితాలు వచ్చాయి. గత వారం టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌కు చేరుకున్న రవి భిష్ణోయ్.. గత కొంతకాలంగా టాప్ వన్డే బ్యాటర్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్ తమ అగ్రస్థానాలను కోల్పోయారు. గిల్ (810), భిష్ణోయ్ ఈ మధ్యకాలంలో (సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భిష్ణోయ్.. వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్) ఆయా ఫార్మాట్లలో ఆడకపోవడం వల్ల టాప్ ర్యాంక్‌లు కోల్పోయారు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడని కోహ్లి (775) కూడా రేటింగ్ పాయింట్లు కోల్పోయినప్పటికీ, మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో భారత ఆటగాళ్ల గైర్హాజరీలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (824) తిరిగి నంబర్ వన్ పీఠాన్ని అధిరోహించాడు. సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో పేట్రేగిపోయిన సూర్యకుమార్ యాదవ్ టీ20 నంబర్ వన్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకోగా.. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్ హోదాలో కొనసాగుతున్నాడు.
టీ20 టాప్ బౌలర్ విషయానికొస్తే.. విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రాణిస్తున్న ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్ ర్యాంక్‌కు చేరుకోగా.. రషీద్ ఖాన్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భిష్ణోయ్ రెండు స్థానాలు దిగజారి మూడో ప్లేస్‌కు పడిపోయాడు.
వన్డే బౌలర్ల విషయానికొస్తే.. కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హాజిల్‌వుడ్, సిరాజ్, జంపా, బుమ్రా టాప్-5లో నిలిచారు. కుల్దీప్ 8, షమీ 11, జడేజా 22 స్థానాల్లో ఉన్నారు.
నంబర్ వన్ టెస్ట్ బౌలర్ విషయానికొస్తే.. అశ్విన్ తన టాప్ ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకోగా..జడేజా 4, షమీ 18, సిరాజ్ 29 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment