మళ్లీ ఐదేసిన రబాడ.. ఫాలో ఆన్‌ ఆడుతున్న బంగ్లాదేశ్‌ | BAN vs SA 2nd Test: Rabada Picked Fifer, Bangladesh Playing Follow On | Sakshi
Sakshi News home page

మళ్లీ ఐదేసిన రబాడ.. ఫాలో ఆన్‌ ఆడుతున్న బంగ్లాదేశ్‌

Published Thu, Oct 31 2024 2:39 PM | Last Updated on Thu, Oct 31 2024 2:49 PM

BAN vs SA 2nd Test: Rabada Picked Fifer, Bangladesh Playing Follow On

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో సౌతాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన సహా తొమ్మిది వికెట్లు పడగొట్టిన రబాడ, రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. రబాడ​ విజృంభించడంతో రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ ఫాలో ఆన్‌ ఆడుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చట్టోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా గెలుపు దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. టోనీ డి జోర్జీ (177), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (106), వియాన్‌ ముల్దర్‌ (105 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కారు. 

ఈ ముగ్గురికి కెరీర్‌లో (టెస్ట్‌) ఇవి తొలి సెంచరీలు. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు తొలి సెంచరీలు నమోదు చేయడం ప్రపంచ రికార్డు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ, ట్రిస్టన్‌, ముల్దర్‌ సెంచరీలతో సత్తా చాటగా.. డేవిడ్‌ బెడింగ్హమ్‌ (59), సెనురన్‌ ముత్తుస్వామి (68 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లాం ఐదు వికెట్లు తీశాడు.

అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. రబాడ దెబ్బకు (5/37) తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. డేన్‌ పీటర్సన్‌, కేశవ్‌ మహారాజ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి ఓ వికెట్‌ దక్కింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్‌ హాక్‌ (82), తైజుల్‌ ఇస్లాం (30), మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు. 

దక్షిణాఫ్రికా తోలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 416 పరుగులు వెనుకపడి ఫాలో ఆన్‌ ఆడుతున్న బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. మూడో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి కేవలం 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు బంగ్లాదేశ్‌ ఇంకా 373 పరుగులు వెనుకపడి ఉంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement