తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం
10 వికెట్లతో పాకిస్తాన్ చిత్తు
రావల్పిండి: సొంతగడ్డపై టెస్టు మ్యాచ్... అటువైపు తమతో పోలిస్తే బలహీన ప్రత్యర్థి... బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై నాలుగు రోజుల ఆటలో పరుగుల వరద పారింది... ఇక చివరి రోజు ఆట ఇలాగే సాగి మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం లాంఛనమే అనిపించింది. కానీ బంగ్లాదేశ్ అద్భుతం చేసి చూపించింది... తమ స్పిన్ బలగంతో పాకిస్తాన్‌ను పడగొట్టింది... అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.. సంచలన ప్రదర్శన ఫలితంగా బంగ్లాదేశ్ తమ టెస్టు చరిత్రలోనే తొలిసారి పాకిస్తాన్‌ను ఓడించింది.
తొలి ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన పాక్ చివరకు పరాజయం పాలైంది. విదేశీ గడ్డపై తొలిసారి జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన నజు్మల్ హసన్ షంటో తన పుట్టిన రోజున అరుదైన విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం ముగిసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 23/1తో ఐదో రోజు ఆట కొనసాగించిన పాక్ బ్యాటర్లు బంగ్లా బౌలింగ్ ముందు తేలిపోయారు.
ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 146 పరుగులకే ఆలౌటైంది. మొహమ్మద్ రిజ్వాన్ (80 బంతుల్లో 51; 6 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (86 బంతుల్లో 37; 3 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. తొలి 3 వికెట్లు పేసర్ల ఖాతాలోకి వెళ్లగా... ఆ తర్వాత ఆఫ్‌స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ 4, లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 3 వికెట్లతో పాక్‌ను దెబ్బ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సాధించిన బంగ్లా ముందు కేవలం 30 పరుగుల లక్ష్యం నిలిచింది.
వికెట్ కోల్పోకుండా 6.3 ఓవర్లలో అర గంటలోపే దీనిని అందుకొని బంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మొదటి ఇన్నింగ్స్‌ను పాక్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా... బంగ్లాదేశ్ 565 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 191 పరుగులు చేసిన ముషి్ఫకర్ రహీమ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండో టెస్టు ఇదే మైదానంలో శుక్రవారం నుంచి జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment