BBL 2022 23: Ellis Hat Trick, Tim David Blitz Condemn Thunder To Another Loss - Sakshi
Sakshi News home page

BBL 2022 23: పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ హ్యాట్రిక్‌.. ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ విధ్వంసం

Published Sun, Jan 15 2023 2:58 PM | Last Updated on Mon, Jan 16 2023 10:35 AM

BBL 2022 23: Ellis Hat Trick, Tim David Blitz Condemn Thunder To Another Loss - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌ 2022-23 సీజన్‌లో భాగంగా సిడ్నీ థండర్స్‌తో ఇవాళ (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌ ఆటగాళ్లు నాథన్‌ ఇల్లీస్‌ (ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌), టిమ్‌ డేవిడ్‌ (ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌) రెచ్చిపోయారు. ఇల్లీస్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో (4/27) నిప్పులు చెరగగా.. టిమ్‌ డేవిడ్‌ (41 బంతుల్లో 76 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న హోబర్ట్‌ టీమ్‌ 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్‌ను మట్టికరిపించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్స్‌.. ఇల్లీస్‌, ప్యాట్రిక్‌ డూలీ (3/22), రిలే మెరిడిత్‌ (2/14), ఫహీమ్‌ అష్రాఫ్‌ (1/28) ధాటికి నిర్ణీత ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. చాలాకాలం తర్వాత బీబీఎల్‌లో అడుగుపెట్టిన డేవిడ్‌ వార్నర్‌ డకౌట్‌ కాగా, ఒలివర్‌ డేవిస్‌ (45), బెన్‌ కట్టింగ్‌ (20), కెప్టెన్‌ క్రిస్‌ గ్రీన్‌ (21) ఓ మోస్తరుగా రాణించారు. 

సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హోబర్ట్‌ హరికేన్స్‌.. టిమ్‌ డేవిడ్‌, కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సిడ్నీ బౌలర్లలో డేనియల్‌ సామ్స్‌ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ వికెట్లతో రెచ్చిపోయిన ఇల్లీస్‌.. బీబీఎల్‌లో ఈ ఘనత సాధించిన 9వ బౌలర్‌గా, సిడ్నీ తరఫున హ్యాట్రిక్‌ సాధించిన రెండో బౌలర్‌గా, ప్రస్తుత సీజన్‌లో మైఖేల్‌ నెసెర్‌ (బ్రిస్బేన్‌ హీట్‌) తర్వాత హ్యాట్రిక్‌ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2012-13 సీజన్‌లో జేవియర్‌ డోహర్తీ సిడ్నీ తరఫున తొలిసారి హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టగా.. బీబీఎల్‌లో ఇప్పటివరకు ఆండ్రూ టై (రెండు సార్లు), జోష్‌ లాలర్‌, రషీద్‌ ఖాన్‌, హరీస్‌ రౌఫ్‌, జేవియర్‌ డోహర్తీ, గురిందర్‌ సంధు, కెమరూన్‌ బాయ్స్‌ ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement