టెస్ట్‌ సిరీస్‌లో విఫలమయ్యాడు.. బీబీఎల్‌లో ఇరగదీశాడు..! | BBL: McSweeney, Renshaw 50s Help Brisbane Heat Make It 2 In 2, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ సిరీస్‌లో విఫలమయ్యాడు.. బీబీఎల్‌లో ఇరగదీశాడు..!

Published Sun, Dec 22 2024 6:24 PM | Last Updated on Sun, Dec 22 2024 6:42 PM

BBL: McSweeney, Renshaw 50s Help Brisbane Heat Make It 2 In 2

టీమిండియాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఓపెనర్‌ నాథన్‌ మెక్‌స్వీని బిగ్‌బాష్‌ లీగ్‌లో అదరగొట్టాడు. అడిలైడ్‌ స్ట్రయికర్స్‌తో ఇవాళ (డిసెంబర్‌ 22) జరిగిన మ్యాచ్‌లో మెక్‌స్వీని మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్‌ ఆడి తన జట్టును (బ్రిస్బేన్‌ హీట్‌) గెలిపించాడు. 

ఈ మ్యాచ్‌లో మెక్‌స్వీని 49 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మెక్‌స్వీనికి జతగా మ్యాట్‌ రెన్‌షా (27 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో అడిలైడ్‌ స్ట్రయికర్స్‌పై బ్రిస్బేన్‌ హీట్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్‌ (24 బంతుల్లో 45 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జేమ్స్‌ బాజ్లీ (11 బంతుల్లో 23; బౌండరీ, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. 

స్ట్రయికర్స్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్‌ (13), క్రిస్‌ లిన్‌ (24), ఓలీ పోప్‌ (34), అలెక్స్‌ రాస్‌ (20) రెండంకెల స్కోర్లు చేశారు. బ్రిస్బేన్‌ హీట్‌ బౌలర్లలో​ ప్రెస్ట్‌విడ్జ్‌ 2, బార్ట్‌లెట్‌, విట్నీ, వాల్టర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రిస్బేన్‌ హీట్‌ చివరి బంతికి గెలుపుతీరాలకు (7 వికెట్లు కోల్పోయి) చేరింది. మెక్‌స్వీని, రెన్‌షా అర్ద సెంచరీలతో రాణించారు. వీరు కాకుండా బ్రిస్బేన్‌ హీట్‌ ఇన్నింగ్స్‌లో పాల్‌ వాల్టర్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశాడు. 

కొలిన్‌ మున్రో (7), జిమ్మీ పియర్సన్‌ (8), మ్యాక్స్‌ బ్రయాంట్‌ (3), విల్‌ ప్రెస్ట్‌విడ్జ్‌ (0), బార్ట్‌లెట్‌ (3) విఫలమయ్యారు. మిచెల్‌ స్వెప్సన్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి బ్రిస్బేన్‌ హీట్‌ను విజయతీరాలకు చేర్చాడు. స్ట్రయికర్స్‌ బౌలర్లలో లాయిడ్‌ పోప్‌, హెన్రీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ షార్ట్‌, జేమీ ఓవర్టన్‌, లియామ్‌ స్కాట్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇదిలా ఉంటే, డిసెంబర్‌ 26 నుంచి టీమిండియాతో జరుగనున్న నాలుగో టెస్ట్‌  కోసం ఆసీస్‌ జట్టును ప్రకటించారు. తొలి మూడు టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమైన నాథన్‌ మెక్‌స్వీని జట్టులో చోటు కోల్పోయాడు. మెక్‌స్వీని స్థానంలో యువ ఆటగాడు సామ్‌ కొన్‌స్టాస్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement