చరిత్ర సృష్టించిన ఆసీస్‌ యువ ఓపెనర్‌.. టీ20 ఫైనల్స్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ | BBL: Mitchell Owen Hit Fastest Century In T20 Tourney Finals | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఆసీస్‌ యువ ఓపెనర్‌.. టీ20 ఫైనల్స్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ

Published Mon, Jan 27 2025 6:37 PM | Last Updated on Mon, Jan 27 2025 7:32 PM

BBL: Mitchell Owen Hit Fastest Century In T20 Tourney Finals

బిగ్‌బాష్‌ లీగ్‌ 2024-25 ఫైనల్స్‌లో ఆసీస్‌ యువ ఓపెనర్‌, హోబర్ట్‌ హరికేన్స్‌ ఆటగాడు మిచెల్‌ ఓవెన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సిడ్నీ థండర్‌తో ఇవాళ (జనవరి 27) జరిగిన ఫైనల్లో 39 బంతుల్లో సెంచరీ చేసిన ఓవెన్‌.. టీ20 టోర్నీల ఫైనల్స్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 

గతంలో ఈ రికార్డు కువైట్‌ ఆటగాడు రవిజ సందరువన్‌ పేరిట ఉండేది. సందరువన్‌ గతేడాది జరిగిన మలేసియా ట్రై నేషన్‌ టీ20 టోర్నీ ఫైనల్లో హాంగ్‌కాంగ్‌పై 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇవాల్టి వరకు టీ20 టోర్నీల ఫైనల్స్‌లో ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీగా చలామణి అయ్యింది. సందరువన్‌ రికార్డును ఇవాళ మిచెల్‌ ఓవెన్‌ చెరిపివేశాడు.

టీ20 టోర్నీల ఫైనల్స్‌లో మూడో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు భారత క్రికెటర్‌ వృద్దిమాన్‌ సాహా పేరిట ఉంది. సాహా 2014 ఐపీఎల్‌ ఫైనల్లో కేకేఆర్‌పై 49 బంతుల్లో శతక్కొట్టాడు. టీ20 టోర్నీల ఫైనల్స్‌లో నాలుగు, ఐదో ఫాస్టెస్ట్‌ సెంచరీల రికార్డులు తమీమ్‌ ఇక్బాల్‌, రిలీ రొస్సో పేరిట ఉన్నాయి. 

తమీమ్‌ 2019 బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్లో ఢాకా డైనమైట్స్‌పై 50 బంతుల్లో సెంచరీ చేయగా.. రిలీ రొస్సో 2024 బీపీఎల్‌ ఫైనల్లో గాలే మార్వెల్స్‌పై 50 బంతుల్లో శతక్కొట్టాడు.

తాజా సెంచరీతో ఓవెన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును కూడా సమం చేశాడు. ఓవెన్‌కు ముందు బీబీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు క్రెయిగ్‌ సైమన్స్‌ పేరిట ఉండేది.  సైమన్స్‌ మూడో బీబీఎల్‌ సీజన్‌లో 39 బంతుల్లో సెంచరీ చేశాడు. ఓవెన్‌ తాజాగా సైమన్స్‌ రికార్డును సమం చేశాడు. 

బీబీఎల్‌లో మూడు, నాలుగో ఫాస్టెస్ట్‌ సెంచరీల రికార్డులు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, జోష్‌ బ్రౌన్‌ పేరిట ఉన్నాయి. మ్యాక్సీ బీబీఎల్‌-11 సీజన్‌లో 41 బంతుల్లో సెంచరీ చేశాడు. బ్రౌన్‌ గత సీజన్‌లో అన్నే బంతుల్లో శతక్కొట్టాడు.

ఓవెన్‌ సునామీ శతకంతో చెలరేగడంతో బీబీఎల్‌ 2024-25 ఫైనల్లో హోబర్ట్‌ హరికేన్స్‌ సిడ్నీ థండర్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓవెన్‌ ఒంటిచేత్తో హరికేన్స్‌కు తొలి బిగ్‌బాష్‌ లీగ్‌ టైటిల్‌ను అందించాడు. చిన్నతనంలో స్టాండ్స్‌లో కూర్చొని హరికేన్స్‌ను ఎంకరేజ్‌ చేసిన 23 ఏళ్ల ఓవెన్‌.. ఇప్పుడు తన జట్టును స్వయంగా గెలిపించాడు. 

ఓవెన్‌ శివాలెత్తిపోవడంతో హరికేన్స్‌ 14 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత సొంత ప్రేక్షకుల మధ్య తొలిసారి టైటిల్‌ గెలిచింది. మిచెల్‌ ఓవెన్‌ సునామీ శతకంతో మ్యాచ్‌ను వన్‌ సైడెడ్‌గా చేశాడు. ఓవెన్‌కు ఈ సీజన్‌లో ఇది రెండో సెంచరీ. తాజా సెంచరీతో ఓవెన్‌ ఈ సీజన్‌లో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గానూ నిలిచాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన ఓవెన్‌ 203.60 స్ట్రయిక్‌ రేట్‌తో 452 పరుగులు చేశాడు. ఇందులో 35 ఫోర్లు, 36 సిక్సర్లు ఉన్నాయి.

థండర్‌తో జరిగిన ఫైనల్లో 11 సిక్సర్లు బాదిన ఓవెన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ ఫైనల్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. బీబీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించే క్రమంలో ఓవెన్‌ లీగ్‌ చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ రికార్డును కూడా నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓవెన్‌ 16 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ఓవెన్‌ 6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ధండర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్‌ సంఘా (42 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (32 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్‌) థండర్‌ తరఫున రాణించారు. హరికేన్స్‌ బౌలర్లలో రిలే మెరిడిత్‌, కెప్టెన్‌ నాథన్‌ ఇల్లిస్‌ తలో మూడు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేసి థండర్‌ను భారీ స్కోర్‌ చేయకుండా అడ్డుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనలో హరికేన్స్‌ ఓపెనర్‌ మిచెల్‌ ఓవెన్‌ దెబ్బ​కు థండర్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓవెన్‌ ధాటికి హరికేన్స్‌ 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓవెన్‌ ఔటయ్యాక మాథ్యూ వేడ్‌ (17 బంతుల్లో 32 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌), బెన్‌ మెక్‌డెర్మాట్‌ (12 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. థండర్‌ బౌలర్లలో తన్వీర్‌ సంఘా 2, టామ్‌ ఆండ్రూస్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement