మహిళల ఐపీఎల్‌కు సంబంధించి చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు వచ్చింది. మహిళల ఐపీఎల్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు బీసీసీఐ ఇవాళ (అక్టోబర్ 18) అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ 91వ సాధారణ వార్షిక సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో మహిళల క్రికెట్‌కు క్రమేపీ పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కామన్‌వెల్త్ క్రీడల దగ్గర నుండి తాజాగా ముగిసిన ఆసియా కప్ వరకు మహిళల క్రికెట్ మ్యాచ్‌లకు ఊహించని టీఆర్పీ వచ్చింది. మ్యాచ్‌లు చూసేందుకు జనాలు స్టేడియంలకు ఎగబడ్డారు. దీంతో ఈ ఊపును క్యాష్ చేసుకోవాలని భావించిన బీసీసీఐ వుమెన్స్ ఐపీఎల్‌కు పచ్చజెండా ఊపింది.
చాలాకాలంగా ప్రచారంలో ఉన్న విధంగా మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తొలి ఎడిషన్‌ను ఐదు జట్లతో స్టార్ట్ చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లీగ్ ప్రారంభ తేదీ తదితర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా, భారత్‌లో మహిళల క్రికెట్‌కు సంబంధించి టీ20 ఛాలెంజ్ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. 2018లో ప్రారంభమైన ఈ టోర్నీలో మూడు జట్లు (వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్) పాల్గొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment