అజిత్ అగార్కర్ ప్యానెల్లో కొత్త సభ్యుడి రాకకోసం ఆహ్వానం (PC:BCCI)
BCCI Men's Senior Selection Committee: భారత క్రికెట్ నియంత్రణ మండలి మెన్స్ సీనియర్ సెలక్షన్ కమిటీలోని ఓ సభ్యుడిపై వేటు పడింది. అతడి స్థానంలో కొత్త మెంబర్‌ను నియమించేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లోనే టీమిండియా వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేసిన విషయం తెలిసిందే.
అతడిపై వేటు
అయితే, అనేక చర్చల అనంతరం మళ్లీ చేతన్ శర్మనే చీఫ్ సెలక్టర్‌గా నియమించిన బోర్డు.. సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శివ్ సుందర్ దాస్, ఎస్.శరత్‌లకు కమిటీలో సభ్యులుగా చోటిచ్చింది. అయితే, ఓ వార్తా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ భారత క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడిపై వేటు వేసింది బీసీసీఐ.
చాలాకాలం పాటు చీఫ్ సెలక్టర్ పోస్టు ఖాళీగా ఉన్న తరుణంలో టీమిండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ఆ పదవిని చేపట్టేలా బోర్డు పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రస్తుతం అగార్కర్ నాయకత్వంలో సెలక్షన్ కమిటీ పనిచేస్తోంది.
త్యాగం చేయాల్సి వస్తోంది
అయితే, ఇందులో భాగమైన సలీల్ అంకోలా తన పదవిని త్యాగం చేయాల్సి వస్తోంది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. సెలక్షన్ కమిటీలో చీఫ్ సెలక్టర్ సహా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ జోన్ల నుంచి ఒక్కో సభ్యుడు ఉండాలి. ప్రస్తుతం ఉన్న కమిటీలో అగార్కర్, సలీల్ వెస్ట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. శివ సుందర్ ఈస్ట్, శరత్ సౌత్, సుబ్రతో బెనర్జీ సెంట్రల్ జోన్ నుంచి ఎంపికయ్యారు.
ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అగార్కర్‌ను కొనసాగించేందుకు నిర్ణయించిన బీసీసీఐ వెస్ట్ నుంచి అదనపు సభ్యుడిగా ఉన్న సలీల్ అంకోలాను తప్పించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్త మెంబర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రకటన విడుదల చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
సెలక్షన్ కమిటీ మెంబర్ కావాలంటే అర్హతలు
ఏడు టెస్టులు లేదంటే 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి. 10 అంతర్జాతీయ వన్డేలు లేదంటే 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అదే విధంగా ఆట నుంచి రిటైర్ అయ్యి ఐదేళ్లు పూర్తై ఉండాలి. అదే విధంగా.. గత ఐదేళ్లకాలంలో ఏ క్రికెట్ కమిటీలోనూ సభ్యుడిగా ఉండకూడదు.
కాగా బీసీసీఐ తాజా ప్రకటన ప్రకారం సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు జనవరి 25, సాయంత్రం ఆరు లోగా తమ అప్లికేషన్ సమర్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment