బిగ్‌బాష్ లీగ్ 2024-25లో మెల్‌బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతమైన విన్యాసం చేశాడు. బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ (జనవరి 1) జరుగుతున్న మ్యాచ్‌లో మ్యాక్సీ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌ను క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ క్యాచ్‌ను చూసి అభిమానులు ఔరా అంటున్నారు.
GLENN MAXWELL!
CATCH OF THE SEASON. #BBL14 pic.twitter.com/3qB9RaxHNb— KFC Big Bash League (@BBL) January 1, 2025
పూర్తి వివరాల్లోకి వెళితే.. మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మ్యాక్స్ బ్రయాంట్ (77 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో బ్రయాంట్‌తో పాటు పాల్ వాల్టర్ (21), టామ్ బాంటన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మెల్‌బోర్న్ బౌలర్లలో స్టీకిటీ రెండు వికెట్లు పడగొట్టగా.. జోయల్ పారిస్, పీటర్ సిడిల్, ఉసామా మిర్, డాన్ లారెన్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇన్నింగ్స్ 17వ ఓవర్‌ను డాన్ లారెన్స్ బౌల్ చేశాడు. తొలి బంతిని ఎదుర్కొన్న విల్ ప్రెస్ట్‌విడ్జ్ భారీ షాట్ ఆడాడు. ప్రెస్ట్‌విడ్జ్ ఈ షాట్ ఆడిన విధానం చూస్తే సిక్సర్ తప్పదని అంతా అనుకున్నారు. ఇక్కడే మ్యాక్స్‌వెల్ మ్యాజిక్ చేశాడు. సెకెన్ల వ్యవధిలో సిక్సర్ వెళ్తున్న బంతిని అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. బౌండరీ లైన్ వద్ద మ్యాక్స్‌వెల్ చేసిన ఈ విన్యాసం చూసి ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. సిక్సర్‌కు వెళ్తున్న బంతిని మ్యాక్సీ గాల్లోకి ఎగిరి లోపలికి తోశాడు. ఆతర్వాత క్షణాల్లో బౌండరీ లోపలికి వచ్చి క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్ మాటల్లో వర్ణించలేనిది. కాగా, ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఈ క్యాచ్‌తో పాటు మరో మూడు క్యాచ్‌లు పట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్‌బోర్న్ స్టార్స్ 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డాన్ లారెన్స్, మార్కస్ స్టోయినిస్ (62) తమ జట్టును గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు. మరో నాలుగు పరుగులు చేస్తే మెల్‌బోర్న్ విజయం సాధిస్తుందనగా బార్ట్‌లెట్ విజృంభించాడు. వరుస బంతుల్లో స్టోయినిస్, మ్యాక్స్‌వెల్‌లను (0) ఔట్ చేశాడు. మొత్తానికి లారెన్స్ (64 నాటౌట్) బాధ్యతగా ఆడి మెల్‌బోర్న్‌ను విజయతీరాలకు చేర్చాడు. మెల్‌బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ డకౌట్ కాగా.. థామస్ రోజర్స్ 6, సామ్ హార్పర్ 8 పరుగులు చేశారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో బార్ట్‌లెట్ నాలుగు, స్పెన్సర్ జాన్సన్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment