Shaheen Afridi Ahead of Indo-Pak Asia Cup 2023 Clash: ‘‘టీమిండియాతో ప్రతి మ్యాచ్ దేనికదే ప్రత్యేకం. అభిమానులకు ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే పండుగే! నేను కూడా అండర్-16 క్రికెట్ మొదలుపెట్టక ముందు మిగతా ఫ్యాన్స్‌లాగే మ్యాచ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడిని.
ఇప్పటి వరకు టీమిండియాతో నా బెస్ట్ స్పెల్ ఇదీ అని స్పెషల్‌గా చెప్పలేను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు సాధించాల్సింది.. అత్యుత్తమంగా చేసి చూపాల్సింది చాలా ఉంది’’ అని పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది అన్నాడు.
టీనేజ్‌లోనే ఎంట్రీ ఇచ్చి
కాగా 2018లో పాకిస్తాన్ తరఫున 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన షాహిన్ ఆఫ్రిది.. అద్భుత బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. అనతికాలంలో జట్టులో కీలక సభ్యుడిగా మారి.. ప్రస్తుతం ప్రధాన పేసర్ స్థాయికి చేరుకున్నాడు.
కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 252 వికెట్లు పడగొట్టిన షాహిన్ ఆఫ్రిది.. ఆసియా కప్-2023తో బిజీగా ఉన్నాడు. టీమిండియాతో సెప్టెంబరు 2 నాటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన ఆఫ్రిది తదుపరి ఆదివారం మరోసారి భారత్‌తో మ్యాచ్‌లో మెరవాలనే పట్టుదలతో ఉన్నాడు.
అదే మా విజయాలకు కారణం
ఈ వన్డే టోర్నీలో ఇప్పటి వరకు ఏడు వికెట్లు పడగొట్టిన షాహిన్.. సహచర పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్‌లతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో మేము పోషించాల్సిన పాత్రలేంటో మాకు తెలుసు.
కొత్త, పాత బంతితో ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా అవగాహన ఉంది. హ్యారిస్ తన వైవిధ్యమైన పేస్‌తో ప్రభావితం చేయగలడు. ఇక నసీం, నేను ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించడంపై ఎక్కువగా దృష్టి సారిస్తాం.
మా మధ్య ఉన్న సమన్వయమే మా విజయాలకు కారణం’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా కొలంబోలో ఆదివారం.. సూపర్-4 దశలో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రిజర్వ్ డే కేటాయించారు.
చదవండి: ఆ సిరీస్ నాటికి అందుబాటులోకి పంత్?; అలాంటి బ్యాటర్ కావాలి: రోహిత్
రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్ ఆఫ్రిది.. ఆరోజే బరాత్!
Comments
Please login to add a commentAdd a comment