Biel Chess Festival 2022: రన్నరప్‌ హరిసూర్య భరద్వాజ్‌ | Biel Chess Festival 2022: Harisurya Bharadwaj Gundepudi runnerup Biel Chess | Sakshi
Sakshi News home page

Biel Chess Festival 2022: రన్నరప్‌ హరిసూర్య భరద్వాజ్‌

Published Sun, Jul 24 2022 5:05 AM | Last Updated on Sun, Jul 24 2022 5:05 AM

Biel Chess Festival 2022: Harisurya Bharadwaj Gundepudi runnerup Biel Chess - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో అమెచ్యూర్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుండేపూడి హరిసూర్య భరద్వాజ్‌ రన్నరప్‌గా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల హరిసూర్య ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి భారత్‌కే చెందిన మన్మయ్‌ చోప్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా మన్మయ్‌కు టాప్‌ ర్యాంక్‌ ఖరారుకాగా, హరిసూర్యకు రెండో ర్యాంక్‌ దక్కింది. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థి హరిసూర్య ఏడు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు.

ప్రణీత్‌కు రెండో జీఎం నార్మ్‌
బీల్‌ చెస్‌ టోర్నీ మాస్టర్స్‌ విభాగంలో తెలంగాణకు చెందిన వుప్పాల ప్రణీత్‌ ఆరు పాయింట్లతో మరో పదిమందితో కలిసి సంయక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా ప్రణీత్‌ కు 15వ స్థానం దక్కింది. ఈ టోర్నీలో ప్రణీత్‌ ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లపై గెలిచి, మరో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్ల తో ‘డ్రా’ చేసుకొని రెండో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) నార్మ్‌ సంపాదించాడు. మూడో జీఎం నార్మ్‌ సాధించి, 2500 రేటింగ్‌ పాయింట్ల మైలురాయి అందుకుంటే ప్రణీత్‌కు గ్రాండ్‌మాస్టర్‌ హోదా ఖరారవుతుంది.  

గుకేశ్‌కు కాంస్య పతకం
బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌ గ్రాండ్‌మాస్టర్‌ ట్రయాథ్లాన్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌కు కాంస్య పతకం లభించింది. తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల గుకేశ్‌ క్లాసికల్‌ విభాగంలో 15 పాయింట్లు, ర్యాపిడ్‌ విభాగంలో 7 పాయింట్లు, బ్లిట్జ్‌ విభాగంలో 7.5 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా 29.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. క్వాంగ్‌ లియెమ్‌ లీ (వియత్నాం; 35.5 పాయింట్లు) విజేతగా నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement