
PC: CA And BBL
సీఏ కీలక నిర్ణయం.. ఆ క్రికెటర్లు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడంపై నిషేధం!
Cricket Australia: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్), యాషెస్ సిరీస్ ఆడుతున్న క్రికెటర్లు అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడాన్ని నిషేధించాలని భావిస్తోంది. న్యూ సౌత్ వేల్స్, విక్టోరియాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కరోనా పాజిటివ్ వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన కారణంగా ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ యాషెస్ రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అతడికి కూడా వైరస్ సోకినట్లు తేలినట్లు సమాచారం. దీంతో సీఏ నిబంధనలు మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లే మాట్లాడుతూ... ‘‘మేము ఎల్లప్పుడూ జాగ్రత్తగానే ఉంటాం. అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిజానికి ఇదొక వేకప్ కాల్ లాంటిది.
వైరస్ అనేది కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు. యాషెస్, బిగ్‌బాష్ లీగ్ ఆడుతున్న క్రికెటర్లు అభిమానులకు కాస్త దూరంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా కొంతమంది బౌలర్లు మైదానంలో ఉండగానే ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ మీడియా కంటపడ్డారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన సీఏ బాస్.. ‘‘నిజంగా ఇది సిగ్గుచేటు. బీబీఎల్ ఆడుతున్న కొంతమంది అభిమానులతో మమేకం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాల్సిందే. బయో బబుల్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు.
చదవండి: IPL 2022: "నాకు ఐపీఎల్‌లో ఆ జట్టుకు ఆడాలని ఉంది"
Ashes Series: సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్