ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్ అందింది. ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా మిడిలార్డర్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డాడని తెలుస్తుంది. సర్ఫరాజ్ మోచేతికి గాయమైనట్లు కనిపిస్తున్న ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. గాయం అనంతరం సర్ఫరాజ్ మోచేతిని పట్టుకుని నెట్స్‌ను వీడాడు. ఈ వీడియోలో సర్ఫరాజ్ నొప్పితో బాధపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
ఒకవేళ సర్ఫరాజ్ ఖాన్ గాయం నిజంగా పెద్దదై అతను తొలి టెస్ట్‌కు దూరమైతే టీమిండియా కూర్పులో తేడాలొస్తాయి. ఇది భారత జట్టుకు శుభ పరిణామం కాదు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్ పిచ్‌లపై అతడు తప్పక రాణిస్తాడని టీమిండియా మేనేజ్‌మెంట్ నమ్మకంగా ఉంది.
27 ఏళ్ల సర్ఫరాజ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో టెస్ట్ అరంగేట్రం చేశాడు. వరుస హాఫ్ సెంచరీలు చేసి కెరీర్‌ను ఘనంగా ప్రారంభించిన సర్ఫరాజ్.. న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్ట్‌లో సూపర్ సెంచరీతో (150) మెరిశాడు. అయితే ఆతర్వాత అతను కాస్త లయ తప్పాడు. సెంచరీ తర్వాత ఏడు ఇన్నింగ్స్‌ల్లో సర్ఫరాజ్ ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు.
కాగా, భారత జట్టు కొద్ది రోజుల కిందట రెండు బ్యాచ్‌లుగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగతా జట్టంతా ఆస్ట్రేలియాకు చేరుకుంది. తొలి టెస్ట్‌కు వేదిక అయిన పెర్త్ వాకా స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. ఇక్కడి ఫాస్ట్ మరియు బౌన్సీ పిచ్‌లపై భారత ప్లేయర్లు నిర్విరామంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
వ్యక్తిగత కారణాల చేత రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం ఇప్పటికే టీమిండియాకు తలనొప్పిగా మారింది. రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా ఎవరిని పంపాలని జట్టు మేనేజ్‌మెంట్ తలలు పట్టుకుంది. ఇప్పుడు సర్ఫరాజ్‌కు కూడా గాయమైతే టీమిండియా సమస్యలు తీవ్రతరమవుతాయి.
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
ట్రావెలింగ్ రిజర్వ్: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.
Comments
Please login to add a commentAdd a comment