క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియాకప్-2023 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ శ్రీలంక, పాకిస్తాన్‌ల వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ విముఖత చూపడంతో ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో ఏసీసీ నిర్వహించనుంది. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఈ ఈవెంట్ సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.
ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధిలు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా తలపడనున్నాయి. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ ఈవెంట్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. ఈ ఆరు జట్లను మొత్తం రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, శ్రీలంక ఉన్నాయి.
ఇందులో రెండు గ్రూపుల నుంచి తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. అదే విధంగా ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం .. పాకిస్తాన్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు , శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక భారత జట్టు మాత్రం తమ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే ఆడనుంది. కానీ ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం చూస్తే ఓ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
అది ఎలా అంటే..?
పాకిస్తాన్ వేదికగా మూడు గ్రూపు స్టేజ్ మ్యాచ్‌లు, ఒక సూపర్ ఫోర్ మ్యాచ్ జరగనుంది. ఆ మూడు గ్రూపు మ్యాచ్‌లు పాకిస్తాన్-నేపాల్, ఆఫ్గానిస్తాన్-బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్-శ్రీలంక మధ్య జరగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 6న లాహోర్ వేదికగా సూపర్-4 తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గ్రూపు-ఎ టాపర్, గ్రూపు-బిలో రెండో స్ధానంలో నిలిచిన జట్లు తలపడనున్నాయి.
భారత జట్టు గ్రూపు-ఎలో ఉందన్న సంగతి తెలిసిందే. ఒకే వేళ గ్రూప్-ఎలో టీమిండియా అగ్రస్ధానంలో నిలిస్తే.. సూపర్ 4 మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్తుందా అన్నది ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న ఇది జరిగితే వేదికను మర్చే అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా లీగ్ స్టేజ్‌లో టీమిండియా మొత్తం అన్ని మ్యాచ్‌లు గెలిచినా.. తమ గ్రూపులో రెండో స్ధానంలో మాత్రమే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలా జరిగితే ఏ2గా భారత్ ఉంటుంది కాబట్టి పాక్‌కు వెళ్లే అవసరం ఉండదు. అయితే దీనిపై ఇప్పటివరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment