బిగ్‌బాష్‌ లీగ్‌లో భయానక ఘటన | Bloodbath In BBL, Aussie Players Injured After Worst Collision | Sakshi
Sakshi News home page

బిగ్‌బాష్‌ లీగ్‌లో భయానక ఘటన

Published Fri, Jan 3 2025 7:42 PM | Last Updated on Fri, Jan 3 2025 7:53 PM

Bloodbath In BBL, Aussie Players Injured After Worst Collision

బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇవాళ (జనవరి 3) భయానక ఘటన చోటు చేసుకుంది. పెర్త్‌ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు సిడ్నీ థండర్‌ ఆటగాళ్లు దారుణంగా ఢీకొట్టుకున్నారు. పెర్త్‌ స్కార్చర్స్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ రెండో బంతికి క్యాచ్‌ పట్టబోయి డేనియల్‌ సామ్స్‌, కెమరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ ఒకరినొకరు బలంగా గుద్దుకున్నారు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో కూపర్‌ కన్నోలీ భారీ షాట్‌ ఆడబోయి బంతిని గాల్లోకి లేపాడు. క్యాచ్‌ పట్టుకునే క్రమంలో సామ్స్‌, బాన్‌క్రాఫ్ట్‌ ఒకరినొకరు చూసుకోకుండా ఢీకొన్నారు. 

ముఖాలు, ముఖాలు గుద్దుకోవడంతో ఇద్దరికీ బలమైన గాయాలయ్యాయి. బాన్‌క్రాఫ్ట్‌ ముక్కులో నుంచి రక్తం కారింది. బాన్‌క్రాఫ్ట్‌ మోకాలు సామ్స్‌ ముఖానికి బలంగా తాకడంతో అతను మైదానంలో పడిపోయాడు. నడవలేని స్థితిలో ఉన్న సామ్స్‌ను స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సామ్స్‌ ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. బాన్‌క్రాఫ్ట్‌ కూడా తిరిగి బరిలోకి దిగలేదు. హ్యాచర్‌ సామ్స్‌ను రీప్లేస్‌ చేశాడు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కార్చర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఫిన్‌ అలెన్‌ (31 బంతుల్లో 68; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకం బాదాడు. కూపర్‌ కన్నోలీ (43 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. మాథ్యూ హర్స్ట్‌ (23), నిక్‌ హాబ​్‌సన్‌ (21 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. థండర్‌ బౌలర్లలో క్రిస్‌ గ్రీన్‌ 3, టామ్‌ ఆండ్రూస్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన థండర్‌ చివరి బంతికి విజయం సాధించింది. షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ బౌండరీ (చివరి బంతికి 3 పరగులు చేయాల్సిన తరుణంలో) బాది థండర్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు చేయాల్సిన తరుణంలో రూథర్‌ఫోర్డ్‌ మూడు బౌండరీలు బాదారు. 

కీల​క ఇన్నింగ్స్‌ (19 బంతుల్లో 39 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) ఆడిన రూథర్‌ఫోర్డ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. థండర్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌ (49), మాథ్యూ గిల్కెస్‌ (43) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ మ్యాచ్‌లో థండర్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్క్రార్చర్స్‌ బౌలర్లలో లాన్స్‌ మోరిస్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement