జనవరి 19, 2021... బ్రిస్బేన్‌లోని ‘గాబా’ మైదానం... భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోయే దృశ్యం ఆవిష్కృతమైంది... 33 ఏళ్లుగా ఆస్ట్రేలియా ఓటమి ఎరుగని వేదికపై టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఒకదశలో పూర్తి ఫిట్‌గా ఉన్న 11 మందిని ఎంచుకోవడమే అసాధ్యం మారిన స్థితిలో ఈ మ్యాచ్ బరిలోకి దిగిన మన జట్టు సంచలన ప్రదర్శనతో విజయంతో పాటు సిరీస్‌నూ సొంతం చేసుకుంది.
రెండేళ్ల తర్వాత నాటి అవమానభారాన్ని మోస్తూ ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో అడుగు పెట్టింది. అయితే మనకు అనుకూలమైన పిచ్‌లు, వాతావరణం, స్పిన్ బలగం... ఇలా అన్నీ టీమిండియా పక్షానే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఆసీస్ బృందం తమ దేశంలో గత సిరీస్‌లో భారత్ ప్రదర్శించిన స్ఫూర్తిదాయక ప్రదర్శనను చూపించగలదా? లేక ఎప్పటిలాగే తలవంచి నిష్క్రమిస్తుందా? స్వదేశంలో అత్యద్భుత రికార్డు ఉన్న భారత్ ప్రత్యర్థిపై ఏ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించగలదో వేచి చూడాలి.
– సాక్షి క్రీడా విభాగం
గత రెండు దశాబ్దాల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. 2001 కోల్‌కతా నుంచి 2021 బ్రిస్బేన్ వరకు విజయం ఎవరిదైనా ఆసక్తికర మలుపు, ఉత్కంఠ నిండిన క్షణాలతో ఇరు దేశాల అభిమానులను అలరించాయి. ఎన్నో హోరాహోరీ సమరాలు, రికార్డులు, ఘనతలు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని ప్రపంచ క్రికెట్‌లో అన్నింటికంటే అత్యుత్తమ టెస్టు పోరుగా మార్చేశాయి. ‘భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం యాషెస్‌కంటే ఎక్కువ’ అని స్టీవ్ స్మిత్ నేరుగా చెప్పడం ఈ సిరీస్ ప్రాధాన్యతను చూపిస్తోంది.
ఇరు జట్ల బలాబలాలు, జట్టులో ప్రస్తుతం ఆడుతున్న సభ్యులను బట్టి చూస్తే గత మూడు సిరీస్‌లు భారత్ ఆధిపత్యంపై స్పష్టతనిస్తాయి. 2016–17లో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 2–1తో గెలుచుకున్న భారత్... ఆ తర్వాత ఆస్ట్రేలియాలో వరుసగా 2018–19లో 2–1తోనే, ఆపై 2020–21లో 2–1తో సిరీస్‌లను సొంతం చేసుకుంది. రేపటి నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌తో నాలుగు టెస్టుల కీలక సమరానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో సాగబోయే ఆసక్తికర ముఖాముఖీలను చూస్తే...
ప్రాక్టీస్‌లో కేఎల్ రాహుల్, కోహ్లి
► భారత గడ్డపై ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ నాథన్ లయన్‌కు మంచి రికార్డే ఉంది. అతను 7 టెస్టుల్లో 30.58 సగటుతో 34 వికెట్లు తీశాడు. తొలి పర్యటనకంటే రెండోసారి అతని ప్రదర్శన మెరుగైంది. మరోవైపు ఆస్ట్రేలియాలో కోహ్లి, పుజారా లపై పేలవ ప్రదర్శన కనబర్చిన లయన్, భారత్‌లో మాత్రం కోహ్లిని 4 సార్లు, పుజారాను 5 సార్లు అవుట్ చేశాడు.
► ఆస్ట్రేలియాలో ఏకంగా 54 సగటుతో 1352 పరుగులు చేసి చెలరేగిపోయిన కోహ్లి... భారత్‌లో మాత్రం అదే ఆసీస్‌పై 33 సగటుతో 330 పరుగులే చేశాడు.
► స్వదేశంలో ఆసీస్‌తో ఆడిన 8 టెస్టుల్లో అశ్విన్ 50 వికెట్లు తీశాడు. ఇప్పుడూ అతనే జట్టుకు కీలకం. వార్నర్‌నే అశ్విన్ 10 సార్లు అవుట్ చేశాడు. జడేజా బౌలింగ్‌లో నూ తీవ్రంగా ఇబ్బంది పడిన వార్నర్ 4 సార్లు అవుటయ్యాడు.
► ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆట ఈ సిరీస్‌లో నిర్ణాయకంగా మారనుంది. భారత గడ్డపై అశ్విన్ బౌలింగ్‌లో ఏకంగా 57 సగటుతో స్మిత్ పరుగులు సాధించాడు. జడేజా బౌలింగ్‌లోనూ 38 సగటుతో పరుగులు చేసిన స్మిత్ వీరిద్దరిని సమర్థంగా ఎదుర్కొంటే కంగారూ బృందం పైచేయి సాధించవచ్చు.
గత సిరీస్‌లో ఏం జరిగిందంటే...
తొలి టెస్టు (పుణే): తాము విసిరిన స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న భారత్ 333 పరుగులతో ఓడింది. ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్‌లలో 260, 285 పరుగులు చేయగా... లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ (12/70) ధాటికి భారత్ 105, 107 పరుగులకే ఆలౌటైంది.
రెండో టెస్టు (బెంగళూరు): భారత్ 75 పరుగులతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 87 పరుగుల ఆధిక్యం లభించినా... రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక జట్టు 112 పరుగులకే కుప్పకూలింది.
మూడో టెస్టు (రాంచీ): భారీ స్కోర్లు నమోదైన ఈ టెస్టు (భారత్ 603/9; ఆస్ట్రేలియా 451, 204/6) ‘డ్రా’గా ముగిసింది. భారత్‌కు చివర్లో గెలుపు అవకాశం వచ్చినా ఆసీస్ బతికిపోయింది.
నాలుగో టెస్టు (ధర్మశాల): 8 వికెట్లతో భారత్ విజయం. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 32 పరుగుల స్వల్ప ఆధిక్యమే లభించినా... రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 137 పరుగులకే కుప్పకూల్చి జట్టు సునాయాస విజయాన్నందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment