అవును. 2023 ప్రపంచ వన్డే క్రికెట్ కప్‌కూ, భారత క్రికెట్ జట్టుకూ మధ్య మిగిలిన దూరం ఇక ఒకే ఒక్క అడుగు. 2011లో ఆఖరుసారిగా కప్ గెలిచిన తర్వాత మళ్ళీ పన్నెండేళ్ళకు తొలిసారిగా భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరడం అభిమానుల్లో ఆనందోత్సాహాల్ని నింపుతోంది. లక్ష్యం చాలా చేరువగా కనిపిస్తుండడంతో అందరిలో ఆశలు రేపుతోంది.
బుధవారం ముంబయ్‌లోని వాంఖెడే స్టేడియమ్‌లో భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక దశ వరకు పోటాపోటీగా సాగిన తొలి సెమీ ఫైనల్‌లో మన జట్టు విజయం సాధించిన తీరు మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో అప్రతిహతంగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా ఆదివారంఅహ్మదాబాద్‌లో మరొక్కసారి చేసే ఫైనల్ ఇంద్రజాలానికై అందరూ ఎదురుచూస్తున్నారు.
2011లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నుంచి చూస్తే గడచిన 2015, 2019 టోర్నీల్లో కన్నా ఈసారే భారత జట్టు విజయావకాశాలు మెరుగ్గా, అధికంగా ఉన్నాయని మొదటి నుంచి క్రికెట్ పండితుల మాట. నిరుడు టీ–20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ నుంచి అవమానకరమైన రీతిలో వెనుదిరిగిన జట్టు ఏడాది తిరిగేసరికల్లా ఇంత బలమైన జట్టుగా రూపొందడం ఒక రకంగా అనూహ్యమే.
ఆ ఘోర ఓటమి తర్వాత జట్టును పటిష్ఠంగా తీర్చిదిద్దడం వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుదల, కోచ్ రాహుల్ ద్రావిడ్ కృషి, ఆటగాళ్ళ నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. మునుపటి రెండు కప్‌ల కన్నా ఈసారి భారత జట్టు మరింత స్థిరంగా, నిలకడగా కనిపిస్తోంది. ఆటగాళ్ళందరూ కలసి కట్టుగా సాగుతూ, వ్యక్తులుగా కన్నా ఒక జట్టుగా ప్రతిభా ప్రదర్శన చేయడం కలిసొస్తోంది.
జట్టు సారథిగా రోహిత్ శర్మ ఆ విషయంలో అందరికీ ఆదర్శమయ్యాడు. ఈ టోర్నీలో కనీసం 3 సందర్భాల్లో వ్యక్తిగత మైలురాళ్ళకు దగ్గర ఉన్నా, దాని కన్నా జట్టు ప్రయోజనాల కోసం వేగంగా పరుగులు చేయడం మీదే దృష్టి పెట్టి, ఆ క్రమంలో ఔటవడమే అందుకు ఉదాహరణ. ఓపెనర్‌గా పరుగుల వరదతో ప్రత్యర్థి బౌలర్ల మానసిక స్థైర్యాన్ని చిత్తు చేసి, భారీ ఇన్నింగ్స్‌కు ఆయన పునాది వేస్తూ వస్తున్నారు.
ఈ టోర్నీలో రోహిత్ శతకాలేమీ సాధించకపోయి ఉండవచ్చు. 124.15 స్ట్రైకింగ్ రేట్‌తో 550 పరుగులు చేసి, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నిలవడం విశేషం. సాధారణంగా వ్యక్తిగత విజయాలు, ప్రతిష్ఠను ఆశించే, ఆరాధించే చోట ఇది అసాధారణం. జట్టులో ఎవరి పాత్ర వారికి నిర్దిష్టంగా నిర్వచించడంలోనూ తెలివైన వ్యూహం, లక్ష్యంపై గురి కనిపిస్తున్నాయి.
బుధవారం నాటి సెమీస్ అందుకు మంచి ఉదాహరణ. ఓపెనర్లు వేసిన పునాదిని పటిష్ఠం చేయడంలో కోహ్లీ, శరవేగంతో పరుగుల వరద పారించడంలో శ్రేయాస్ అయ్యర్, కొనసాగింపుగా రాహుల్, బౌలింగ్‌లో ప్రత్యర్థుల భాగస్వామ్యాన్ని ఛేదించడానికి పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌ల త్రయం, స్పిన్నర్లుగా కుల్దీప్, జడేజాలు సమర్థంగా పాత్ర పోషిస్తున్నారు.
ముఖ్యంగా జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తుండడం విశేషం. శుభ్‌మన్ గిల్ లాంటి వారి పాత్ర తక్కువేమీ కాదు. బ్యాటింగ్‌లో కోహ్లీ, శ్రేయాస్‌లు వరుసగా సెంచరీల మీద సెంచరీలు కొడుతు న్నారు. సెమీస్‌లోనే వన్డేల్లో శతకాల అర్ధ సెంచరీ పూర్తి చేసి, బ్యాట్స్‌మన్ల కింగ్ కోహ్లీ అయ్యాడు. ఆరాధ్య దైవమైన సచిన్ చూస్తుండగా, అతని రికార్డును అధిగమిస్తూ ఈ కొత్త చరిత్ర సృష్టించాడు.
ఈసారి భారత బౌలర్ల అమోఘ ప్రతిభా ప్రదర్శన మళ్ళీ 1983 నాటి కపిల్ డెవిల్స్‌ను తలపిస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో మొదటి 4 మ్యాచ్‌ల తర్వాత ఆలస్యంగా తుది జట్టులోకి వచ్చిన పేస్‌బౌలర్ షమీ ఇప్పటికే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టి, వికెట్ల వేటగాడిగా నిలిచాడు. వికెట్లలో అర్ధశతకం పూర్తిచేశాడు.
ప్రపంచ కప్ చరిత్రలో మరి ఏ ఇతర భారతీయ ఆటగాడికీ లేని రీతిలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి, నంబర్ 1గా నిలిచాడు. లయ తప్పకుండా, పిచ్ మీద వికెట్ల గురి తప్పకుండా, పరుగు వేగం తగ్గకుండా ప్రత్యర్థులపై పులిలా విరుచుకుపడుతున్న షమి ఈ భారత జట్టు అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం. ఈ 19న జరిగే ఫైనల్‌లో షమీ ఇలాగే విజృంభిస్తే మనం కప్పు కొట్టడం కష్టమేమీ కాదు.
గురువారం నాటి రెండో సెమీఫైనల్‌లో ఎప్పటిలానే సెమీస్ శాపం తప్పించుకోలేక సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో తడబడింది. ఈ టోర్నీలో మొదట తడబడినా తర్వాత నిలబడిన ఆస్ట్రేలియా ఆఖరికి తక్కువ పరుగుల లక్ష్యాన్ని సైతం శ్రమించి, గెలిచింది. ఓడితేనేం పోరాటస్ఫూర్తిలో సౌతాఫ్రికా జనం మనసు గెలిచింది.
అయిదుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ప్రయోగం చేస్తున్న భారత్, అయిదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన బలమైన ఆసీస్‌తో మహాయుద్ధానికి సమస్త శక్తియుక్తులూ కేంద్రీకరించాలి. అయితే, ఇప్పటికే భారత టాప్ 5 బ్యాట్స్‌మన్లు 65.8 సగటుతో 2570 పరుగులు సాధించారు. 2007 నాటి ఆసీస్ జట్టు బ్యాట్స్‌మన్ల సగటు కన్నా ఇది ఎక్కువ. అలాగే ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆసీస్ ఆటను గమనిస్తే ఆ జట్టు మరీ అజేయమైనదేం కాదనీ అర్థమవుతుంది.
అందుకే, వరల్డ్ కప్ వేదికపై 1983లో అనామకంగా వెళ్ళి అద్భుతం చేసిన∙కపిల్ సేన, 2011లో ఒత్తిడిని తట్టుకొని అంచనాలందుకున్న ధోనీ అండ్ కో తర్వాత ముచ్చటగా మూడోసారి ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ టీమ్ ఆ ఘనత సాధిస్తే ఆశ్చర్యం లేదు.
పుష్కరకాలం నిరీక్షణ ఫలిస్తే శతకోటి భారతీయులకు అంతకన్నా ఆనందమూ లేదు. అనూహ్య ఘటనలు జరిగితే తప్ప ఆతిథ్య దేశమైన మనమే ఈ ఆదివారం ఐసీసీ వరల్డ్ కప్ అందుకోవచ్చు. ఎందుకంటే– ప్రతిసారి కన్నా భిన్నంగా ఈసారి మనది వట్టి ఆశ, అభిమానుల ప్రార్థన కాదు... అంతకు మించిన ప్రతిభా ప్రదర్శన, ఆత్మవిశ్వాస ప్రకటన!
ఒక్క అడుగు... ఒకే ఒక్క అడుగు!
Published Fri, Nov 17 2023 12:22 AM | Last Updated on Fri, Nov 17 2023 12:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment