అడిలైడ్ : ఆసీస్ మాజీ బౌలర్.. స్పీడస్టర్ బ్రెట్ లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బ్రెట్ లీ పేరు సంపాదించాడు. గంటకు 160 కిమీ వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు సవాల్ విసిరేవాడు. అతని వేగం దాటికి వికెట్లు విరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బ్రెట్ లీ తన వైవిధ్యమైన బౌలింగ్‌లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కూడా చాలా సార్లు ఔట్ చేశాడు. అయితే సచిన్ ఆడిన ఒక్క షాట్ మాత్రం తన జీవితాంతం గుర్తుండిపోతుందని లీ చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. తాజాగా మరోసారి ఆ విషయాన్ని పంచుకున్నాడు.
'సచిన్‌ను నేను ఎన్నోసార్లు ఔట్ చేశాను.. అలాగే చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. కానీ సచిన్ నన్ను ఇబ్బంది పెట్టింది మాత్రం 2008 సీబీ సిరీస్. సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో గంటకు 160 కిమీ వేగంతో బంతులు వేశా.. నా బంతులకు టీమిండియా బ్యాట్స్‌మెన్ బెంబెలెత్తారు. అయితే సచిన్‌కు వేసిన ఒక బంతి సుమారు 165 కిమీ వేగం ఉంటుందని అనుకుంటా. దానిని కూల్‌గా ఆడిన సచిన్ ఆఫ్‌డ్రైవ్ దిశగా ఫోర్ బాదేశాడు. సచిన్ షాట్‌తోవా క్షణంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాంటి బంతినే ఫోర్ కొడితే.. ఇక నేనేం చేయాలి. ఇలాంటివి లెజెండ్స్‌కు మాత్రమే సాధ్యం' అని మనసులో అనుకుంటూ తరువాతి బంతికి సిద్ధమయ్యానంటూ' లీ తెలిపాడు. 1999లో అరంగేట్రం చేసిన బ్రెట్ లీ ఆసీస్ తరపున 76 టెస్టుల్లో 310, 221 వన్డేల్లో 380 వికెట్లు, 25 టీ20ల్లో 28 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment