
56 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 125 నాటౌట్
ఆస్ట్రేలియాపై టి20లో చెలరేగిన సఫారీ బ్యాటర్
53 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం
డార్విన్: దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ప్రదర్శనతో చెలరేగిపోయాడు. ఆ్రస్టేలియాతో జరిగిన రెండో టి20లో అతను ఫోర్లు, సిక్సర్లతో సత్తా చాటి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో బ్రెవిస్ దక్షిణాఫ్రికా తరఫున టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 53 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
ఆ్రస్టేలియాపై దక్షిణాఫ్రికాకు టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (56 బంతుల్లో 125 నాటౌట్; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. అనంతరం ఆసీస్ 17.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. టిమ్ డేవిడ్ (24 బంతుల్లో 50; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... మిగతావారంతా విఫలమయ్యారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా, చివరి టి20 శనివారం జరుగుతుంది.
బౌండరీలతోనే 96 పరుగులు...
ఐదో ఓవర్లో దక్షిణాఫ్రికా స్కోరు 44/2 వద్ద ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన బ్రెవిస్ చివరి వరకు నిలిచాడు. తాను ఎదుర్కొన్న మూడో బంతికి తొలి ఫోర్ కొట్టిన అతను అదే జోరు కొనసాగిస్తూ ఒక దశలో 24 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ ఓవర్లో వరుసగా 6, 6, 4, 6 బాదడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో అతను 56 పరుగుల వద్ద ఉన్నప్పుడు లాంగాన్‌లో ఇచ్చిన క్యాచ్‌ను కునెమన్ వదిలేయడం కూడా కలిసొచ్చింది.
25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసున్న బ్రెవిస్‌కు శతకం చేసుకునేందుకు మరో 16 బంతులు మాత్రమే సరిపోయాయి. హాజల్‌వుడ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన తర్వాత డ్వార్‌షుయిస్ ఓవర్లో కొట్టిన మూడో ఫోర్‌తో 41 బంతుల్లోనే బ్రెవిస్ శతకం పూర్తయింది. ఛేదనలో డేవిడ్‌కు ఇతర ఆసీస్ బ్యాటర్లెవరూ సహకారం అందించలేదు. ఒకదశలో 9.3 ఓవర్లలో 106/3తో ఉన్నా...ఆ తర్వాత జట్టు తడబడింది.
125 టి20ల్లో దక్షిణాఫ్రికా తరఫున బ్రెవిస్ స్కోరు (125) అత్యధికం. డుప్లెసిస్ (119)ను అతను అధిగమించాడు.
2 దక్షిణాఫ్రికా తరఫున ఇది రెండో ఫాస్టెస్ట్ (41 బంతుల్లో) సెంచరీ. ప్రస్తుతం డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉంది.
1 అతి పిన్న వయసులో అంతర్జాతీయ టి20 శతకం బాదిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా (22 ఏళ్ళ 105 రోజులు) నిలిచిన బ్రెవిస్... రిచర్డ్ లెవీ (24 ఏళ్ల 36 రోజులు) రికార్డును సవరించాడు.
చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన బ్రెవిస్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు