బుమ్రా మాస్టర్ మైండ్‌.. ట్రాప్‌లో చిక్కుకున్న‌ స్మిత్‌! వీడియో | Bumrah's Leg-Side Trap Weaves Magic; Smith Gets Out Cheaply | Sakshi
Sakshi News home page

IND vs AUS:బుమ్రా మాస్టర్ మైండ్‌.. ట్రాప్‌లో చిక్కుకున్న‌ స్మిత్‌! వీడియో

Published Sat, Dec 7 2024 11:53 AM | Last Updated on Sat, Dec 7 2024 12:01 PM

Bumrah's Leg-Side Trap Weaves Magic; Smith Gets Out Cheaply

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌పై టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి పైచేయి సాధించాడు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో స్మిత్‌ను అద్బుతమైన బంతితో బుమ్రా బోల్తా కొట్టించాడు. బుమ్రా ట్రాప్‌లో చిక్కుకున్న స్మిత్.. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

రెండో రోజు ఆట ఆరంభంలోనే ఆసీస్ యువ ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీని బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత స్మిత్ క్రీజులోకి వచ్చాడు. తొలి టెస్టులో విఫలమైన స్మిత్‌.. కనీసం అడిలైడ్ టెస్టులోనైనా తన బ్యాట్‌కు పని చెబుతాడని ఆసీస్ జట్టు మెనెజ్‌మెంట్ ఆశించింది. 

కానీ వారి ఆశలపై బుమ్రా నీళ్లు జల్లాడు. స్మిత్ క్రీజులోకి వచ్చిన వెంటనే బుమ్రా ఓవర్ ది వికెట్ నుండి ఆఫ్ స్టంప్ చుట్టూ గుడ్ లెంగ్త్ డెలివరీలను సంధించాడు. దీంతో స్మిత్ క్రమంగా ఆఫ్ స్టంప్ వైపు వచ్చి బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే ఇక్కడే బుమ్రా తన బౌలింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. 41వ ఓవర్ వేసిన బుమ్రా తొలి బంతిని  తన బౌలింగ్ లైనప్‌ను మార్చుకుని లెగ్ స్టంప్ దిశగా స్మిత్‌కు సంధించాడు. అయితే బుమ్రా ట్రాప్‌లో చిక్కుకున్న స్మిత్ ఆ బంతిని డౌన్ లెగ్ వైపు ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు.

కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతికి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కూడా స్మిత్‌ను బుమ్రానే ఔట్ చేయ‌డం గ‌మ‌నార్హం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement