Asia Cup 2023: ‘‘ప్రస్తుతం యుజువేంద్ర చహల్‌కు టీమిండియాలో స్థానం దక్కించుకునే అర్హత లేదు. గత కొంతకాలంగా అతడు నిలకడలేమి ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరోవైపు.. కుల్దీప్ యాదవ్.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా వికెట్లు తీస్తున్నాడు.
మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతూ జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తున్నాడు. చహల్‌ను కాదని సెలక్టర్లు కుల్దీప్‌ను ఎంపిక చేసి సరైన నిర్ణయం తీసుకున్నారు’’ పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా అన్నాడు.
ఆసియా కప్-2023కి ఎంపిక చేసిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్ చహల్‌కు స్థానం ఇవ్వకపోవడమే మంచిదైందని ఈ లెగ్ బ్రేక్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో యుజీ చహల్‌కు మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే.
అందుకే చహల్‌పై వేటు
అతడిని కాదని మరో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గుచూపింది. ఈ విషయం గురించి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు జట్టులో చోటు లేదని.. ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి చూడలేమని స్పష్టం చేశాడు.
అదే విధంగా.. ఆసియా కప్ జట్టు జాబితా నుంచే వన్డే వరల్డ్‌కప్‌నకు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో.. కుల్దీప్ మెరుగ్గా రాణిస్తే ఐసీసీ ఈవెంట్‌పై కూడా చహల్ ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది.
అంతటి మొనగాడు లేడు..అయినా
ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సహా సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు చహల్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై మేనేజ్‌మెంట్ తీరును విమర్శిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా స్పిన్నర్లలో చహల్‌ను మించి మొనగాడు లేడని.. అలాంటిది తనకు జట్టులో చోటు లేకపోవడం ఏమిటని భజ్జీ ఫైర్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాత్రం బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబరు 2న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
చదవండి: అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను భయపడ్డాను: గంభీర్
Comments
Please login to add a commentAdd a comment