
మోంటేకార్లో: ఫార్ములా వన్ (ఎఫ్1) సీజన్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న మెర్సిడెస్, రెడ్‌బుల్ డ్రైవర్లకు ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ చెక్ పెట్టాడు. తన సొంత గ్రాండ్‌ప్రి అయిన మొనాకో స్ట్రీట్ సర్క్యూట్‌లో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో సత్తా చాటిన లెక్‌లెర్క్ సీజన్‌లో తొలి పోల్ సాధించాడు. కెరీర్‌లో అతడికి ఇది ఎనిమిదో పోల్. 2019 మెక్సికన్ గ్రాండ్‌ప్రిలో చివరిసారిగా లెక్‌లెర్క్ పోల్ సాధించాడు. మొనాకో వీధుల గుండా సాగిన క్వాలిఫయింగ్ చివరి సెషన్‌లో నిమిషం 10.346 సెకన్లలో ల్యాప్‌ను అతను పూర్తి చేశాడు. అయితే సెషన్ మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా లెక్‌లెర్క్ కారు ప్రమాదానికి గురైంది. ఒకవేళ అతని కారు గేర్ బాక్స్‌ను మారిస్తే... లెక్‌లెర్క్‌కు ఐదు స్థానాల గ్రిడ్ పెనాల్టీ పడుతుంది. లేదంటే ఆదివారం జరిగే ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 0.230 సెకన్లు ఆలస్యంగా ల్యాప్‌ను ముగించిన వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. స్పానిష్ గ్రాండ్‌ప్రితో పోల్‌ల సెంచరీ కొట్టిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ఈ క్వాలిఫయింగ్ సెషన్ ఏ మాత్రం కలిసి రాలేదు. పోల్ సిట్టర్‌కు 0.749 సెకన్లు వెనుకగా ల్యాప్‌ను పూర్తి చేసిన అతను ఏకంగా ఏడో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment