చెన్నై సూపర్ కింగ్స్ జట్టు(PC: IPL/BCCI)
పుణే: సారథ్యం మారేసరికి సర్వస్వం మారిపోయింది. చెన్నై ఆటతీరు అదిరిపోయింది. ధోని కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై మళ్లీ అచ్చంగా సూపర్ కింగ్స్ అయ్యింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోని బృందం 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 202 పరుగుల భారీస్కోరు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓపెనింగ్‌లో చెలరేగారు. తర్వాత హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (33 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అందివచ్చిన లైఫ్‌లతో అర్ధసెంచరీ చేశాడు.
రుతురాజ్ సెంచరీ మిస్
చెన్నై బ్యాటింగ్ నింపాదిగా మొదలైంది. రుతురాజ్, కాన్వే తొలి ఐదు ఓవర్లలో బంతిని మూడుసార్లు మాత్రమే బౌండరీ (2 ఫోర్లు, 1 సిక్స్)ని దాటించారంతే! కానీ తర్వాత ఆట రూటే వేరు! ఇదే జోడీ దాదాపు 18 ఓవర్లు (17.5) ఆడేసింది. ఒక్క భువనేశ్వర్ మినహా అందరినీ రుతురాజ్, కాన్వే చితకబాదేశారు. ముఖ్యంగా తన పేస్‌తో నిప్పులు చెరుగుతున్న ఉమ్రాన్ మలిక్ (0/48) బౌలింగ్‌ను రుతురాజ్ ఫోర్లు, కళ్లు చెదిరే సిక్సర్లతో తుత్తునీయలు చేశాడు.
8వ ఓవర్లో 50 స్కోరు చేసిన చెన్నై 11వ ఓవర్ (10.5) ముగియక ముందే 100 మార్కు దాటింది. మరో 9 ఓవర్లలో (19.5) 200 పరుగుల్ని అవలీలగా దాటింది. రుతురాజ్ 33 బంతుల్లో, కాన్వే 39 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తిచేసుకున్నారు. పరుగు తేడాతో రుతురాజ్ సెంచరీని చేజార్చుకున్నాడు.
ముకేశ్ దెబ్బకు...
హైదరాబాద్ లక్ష్యాన్ని ధాటిగా ఛేదించేందుకు ప్రయత్నించింది. ఓపెనర్లు విలియమ్సన్ (37 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆటతో పరుగు పెట్టించారు. దీంతో ఓవర్‌కు 10 పైచిలుకు పరుగులు వచ్చాయి. అయితే ముకేశ్ ఆరో ఓవర్లో వరుస బంతుల్లో అభిషేక్‌తో పాటు రాహుల్ త్రిపాఠి (0)ని ఔట్ చేసి దెబ్బ మీద దెబ్బ తీశాడు.
తర్వాత మార్క్‌రమ్ (17; 2 సిక్సర్లు), విలియమ్సన్ క్రీజులో ఉన్నంత వరకు 11 ఓవర్ల దాకా పటిష్టంగా కనిపించినా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. 3 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన ముకేశ్ చౌదరి తన ఆఖరి, ఇన్నింగ్స్ 20వ ఓవర్లో 6, 4, 0, వైడ్, 6, 6, 1లతో ఏకంగా 24 పరుగులు సమర్పించుకోవడంతో ధోని అసహనం వ్యక్తం చేయగా, గెలుపు అంతరం తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment