రియాద్: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా పోరాడిన అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో 20 ఏళ్ల కోకో గాఫ్ విజేతగా నిలిచింది. మూడోసారి ఈ టోర్నీలో ఆడుతున్న కోకో గాఫ్ తొలిసారి చాంపియన్‌గా అవతరించింది.
ఏకంగా.. 3 గంటల 4 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 7–6 (7/2)తో ప్రపంచ ఏడో ర్యాంకర్, చైనా రైజింగ్ స్టార్ కిన్‌వెన్ జెంగ్‌పై చిరస్మరణీయ విజయం అందుకుంది.
విజేతగా నిలిచిన కోకో గాఫ్‌నకు 48,05,000 డాలర్ల (రూ. 40 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీ, 1300 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కిన్‌వెన్ జెంగ్‌కు 23,05,000 డాలర్ల (రూ. 19 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీ, 800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై గెలిచిన కోకో గాఫ్‌నకు తుది పోరులో గట్టిపోటీనే ఎదురైంది.
టైబ్రేక్‌లో కోకో పైచేయి
తొలి సెట్‌ను చేజార్చుకున్న కోకో రెండో సెట్‌లో ఒకదశలో 1–3తో వెనుకబడింది. కానీ వరుసగా మూడుసార్లు కిన్‌వెన్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కోకో అదే జోరులో సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో కోకో 3–5తో వెనుకంజలో పడింది. తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్న కోకో పదో గేమ్‌లో కిన్‌వెన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసింది.
ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో కోకో పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకొని 2014లో సెరెనా విలియమ్స్ తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచిన అమెరికా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది కోకో మొత్తం 54 మ్యాచ్‌ల్లో గెలిచి, 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓవరాల్‌గా మూడు టైటిల్స్ (బీజింగ్ ఓపెన్, ఆక్లాండ్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్) సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment