WTA finals
-
జయహో జెంగ్...
టోక్యో: పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, చైనా టెన్నిస్ స్టార్ కిన్వెన్ జెంగ్ ఒకే విజయంతో రెండు లక్ష్యాలు సాధించింది. ఆదివారం ముగిసిన టొరే పాన్ పసిఫిక్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో ప్రపంచ ఏడో ర్యాంకర్ కిన్వెన్ కెరీర్లో ఐదో సింగిల్స్ టైటిల్ సాధించడంతోపాటు సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత పొందింది. 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా)తో జరిగిన ఫైనల్లో కిన్వెన్ జెంగ్ 7–6 (7/5), 6–3తో విజయం సాధించింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కిన్వెన్ ఏకంగా 16 ఏస్‌లు సంధించింది. కిన్‌వెన్‌కు 1,42,000 డాలర్ల (రూ. 1 కోటీ 19 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సూపర్ స్వియాటెక్...
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తొలిసారి విజేతగా నిలిచి మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. మెక్సికోలో మంగళవారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్ 6–1, 6–0తో ఐదో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)ను ఓడించింది. స్వియాటెక్ కు ట్రోఫీతోపాటు 30,78,000 డాలర్ల (రూ. 25 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్ పెగూలాకు 16,02,000 డాలర్ల (రూ. 13 కోట్ల 33 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
వరల్డ్ నంబర్ వన్‌కు షాక్
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్)కు రెండో లీగ్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మెక్సికోలోని కాన్కున్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అమెరికా ప్లేయర్ జెస్సికా పెగూలా 6–4, 6–3తో సబలెంకాను ఓడించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెగూలా ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు సబలెంకా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సబలెంకా, రిబాకినా (కజకిస్తాన్) మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌కు రెండో సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. -
స్వియాటెక్‌కు సబలెంకా షాక్
టెక్సాస్ (అమెరికా): ఈ ఏడాదిని మరో టైటిల్‌తో ముగించాలని ఆశించిన ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు నిరాశ ఎదురైంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. బెలారస్ ప్లేయర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–2, 2–6, 6–1తో స్వియాటెక్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన స్వియాటెక్ సెమీస్‌లో మాత్రం సబలెంకా ధాటికి తడబడింది. ఈ ఏడాది స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు మరో ఆరు టోర్నీలలో విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఆమె 67 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో సెమీఫైనల్లో కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–2తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచి ఫైనల్లో సబలెంకాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. సాకరి కూడా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి కీలకమైన సెమీఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. -
చాంపియన్ యాష్లే బార్టీ
షెన్జెన్ (చైనా): మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో యాష్లే బార్టీ 6–4, 6–3తో డిఫెండింగ్ చాంపియన్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. గతంలో స్వితోలినాతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన బార్టీ మెగా ఫైనల్లో మాత్రం తన ఆధిపత్యాన్ని చాటుకుంది. విజేతగా నిలిచిన యాష్లే బార్టీకి 44 లక్షల 20 వేల డాలర్లు (రూ. 31 కోట్ల 17 లక్షలు).... రన్నరప్ స్వితోలినాకు 24 లక్షల డాలర్లు (రూ. 16 కోట్ల 92 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓ టెన్నిస్ టోర్నమెంట్లో విజేతకు ఇంత భారీ మొత్తం ప్రైజ్‌మనీ ఇవ్వడం ఇదే తొలిసారి. గతేడాది సింగపూర్‌లో జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత స్వితోలినా ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఈ టోర్నీలో స్వితోలినా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గడంతోపాటు సెమీఫైనల్లోనూ గెలిచి ఫైనల్ చేరింది. ఒకవేళ స్వితోలినా ఫైనల్లో గెలిచుంటే టోర్నీ నిబంధనల ప్రకారం అజేయంగా నిలిచినందుకు ఆమెకు 47 లక్షల 25 వేల డాలర్లు (రూ. 33 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించేవి. 86 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బార్టీ తొలి సెట్ పదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను గెల్చుకుంది. రెండో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డా... ఎనిమిదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని బార్టీ విజేతగా నిలిచింది. ఈ ఏడాది బార్టీ మొత్తం నాలుగు టైటిల్స్ సాధించింది. సీజన్‌ను 15వ ర్యాంక్‌తో ప్రారంభించిన బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఆ తర్వాత మయామి ఓపెన్‌లో... ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. బర్మింగ్హమ్ ఓపెన్‌లోనూ టైటిల్ సాధించి కెరీర్లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఈ ఏడాదిని ఆమె నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది. 2 ఇవాన్ గూలాగాంగ్ (1976లో) తర్వాత డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ టైటిల్ సాధించిన రెండో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా యాష్లే బార్టీ నిలిచింది. 5 సీజన్ ముగింపు టోర్నీ ఫైనల్స్‌లో బరిలోకి దిగిన తొలిసారే విజేతగా అవతరించిన ఐదో క్రీడాకారిణిగా బార్టీ గుర్తింపు పొందింది. గతంలో సెరెనా విలియమ్స్ (అమెరికా–2001లో), మరియా షరపోవా (రష్యా–2004లో), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్–2011లో), సిబుల్కోవా (స్లొవేకియా–2016లో) ఈ ఘనత సాధించారు. బాబోస్–మ్లాడెనోవిచ్ జంటకు డబుల్స్ టైటిల్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ డబుల్స్ విభాగంలో తిమియా బాబోస్ (హంగేరి)–క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట టైటిల్ సాధించింది. ఫైనల్లో ఈ జంట 6–1, 6–3తో సు వె సెయి (చైనీస్ తైపీ)– బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలిచింది. టోర్నీ మొత్తంలో అజేయంగా నిలిచినందుకు తిమియా–క్రిస్టినా జంటకు 10 లక్షల డాలర్ల (రూ. 7 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది. -
ఆట మధ్యలో ఆసక్తికర ఘటన
-
ఆట మధ్యలో ఆసక్తికర ఘటన
సింగపూర్: క్రీడల్లో రాణించేందుకు క్రీడాకారులు చాలా త్యాగాలు చేస్తుంటారు. ఫిట్ నెస్ కాపాడుకునేందుకు కష్టమైన కసరత్తులతో కుస్తీలు పడుతుంటారు. ఏదిబడితే అది తినకుండా నోరు కట్టేసుకుంటారు. చావోరేవో తేల్చుకునే మ్యాచ్ ఎదురైతే విజయం కోసం ఎంతో శ్రమిస్తారు. సరదాలు, విహారాలు కట్టిపెట్టి ఆటమీదే పూర్తిగా దృష్టి పెడతారు. రష్యా టెన్నిస్ ప్లేయర్ స్వెత్లానా కుజ్నెత్సోవా తన జుట్టును త్యాగం చేసింది. తన ఆటకు అడ్డువస్తుందని మ్యాచ్ మధ్యగా ఉండగా, అందరూ చూస్తుండగా తన జుట్టును కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రద్వాంస్కా తో ఈ మ్యాచ్ లో కుజ్నెత్సోవా తలపడింది. మొదటి సెట్ గెలిచిన కుజ్నెత్సోవా రెండో సెట్ లో డీలా పడింది. నిర్ణయాత్మక మూడో సెట్ ఆడడానికి ముందు అంపైర్ నుంచి పెద్ద కత్తెర అడిగితీసుకుని తన జట్టును కత్తిరించుకుంది. కుజ్నెత్సోవా చర్యతో వీక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. జుట్టుపోయినా మ్యాచ్ గెలవడంతో ఆమెకు ఊరట లభించింది. జుట్టు కంటే మ్యాచ్ గెలవడమే ముఖ్యమనుకున్నానని ఆట ముగిసిన తర్వాత కుజ్నెత్సోవా చెప్పింది. అయితే టెన్నిస్ ప్లేయర్లు జట్టు కత్తిరించుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో రాఫెల్ నాదెల్ తో జరిగిన మ్యాచ్ లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే కనుబొమ్మలపై వెంట్రులను కత్తిరించుకున్నాడు. ఒకటిఆరా వెంట్రుకలే కాబట్టి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. -
సీజన్ ముగింపు టోర్నీకి సెరెనా దూరం
సింగపూర్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ నుంచి ఐదుసార్లు మాజీ విజేత సెరెనా విలియమ్స్ వైదొలిగింది. భుజం గాయం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన సెరెనా వివరించింది. సింగపూర్ వేదికగా ఈ టోర్నీ ఈనెల 23 నుంచి 30 వరకు జరుగుతుంది. ప్రపంచ సింగిల్స్ ర్యాంకిం గ్సలో టాప్-8లో ఉన్న వాళ్లు ఈ టోర్నీలో ఆడతారు. ‘సింగపూర్‌కు వచ్చి అత్యుత్తమ క్రీడాకారిణులతో ఆడాలని ఆశించాను. కానీ భుజం గాయం పూర్తిగా తగ్గాలంటే నిలకడగా చికిత్స తీసుకోవాలని నా వైద్యుడు సూచించాడు. దాంతో రాబోయే కొన్ని వారాలపాటు నేను ఆటకు దూరంగా ఉంటాను’ అని సెరెనా తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఇప్పటికే ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), సిమోనా హలెప్ (రొమేనియా), అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ముగురుజా (స్పెరుున్), మాడిసన్ కీస్ (అమెరికా), సిబుల్కోవా (స్లొవేకియా) అర్హత సాధించారు. -
సెమీస్ కు చేరిన సానియా జోడి
సింగపూర్: సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట వరుసగా మూడో విజయాన్ని సాధించి సెమీ ఫైనల్ కు చేరింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సానియా జోడి 6-4, 7-5 తేడాతో తిమియా బాబోస్(హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లపై విజయం సాధించింది. 90 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో ఈ ఇండో-స్విస్ జోడీకి గట్టిపోటీ ఎదురైంది. తొలి సెట్ ను అవలీలగా గెలుచుకున్నా.. రెండో సెట్ లో మాత్రం తీవ్ర పోటీ తప్పలేదు. ఓదశలో సెట్ చేజారిపోతున్నట్లు కనిపించినా.. పోరాడి రెండో సెట్ ను కూడా కైవసం చేసుకుని సెమీస్ కు చేరింది. ఈ తాజా విజయంతో సానియా-హింగిస్ జంట తమ వరుస విజయాలను సంఖ్యను 20 కు పెంచుకుని తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. -
సెరెనా ‘హ్యాట్రిక్'
సింగపూర్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) సొంతం చేసుకుంది. వరుసగా మూడో ఏడాది సెరెనా ఈ టోర్నీ విజేతగా నిలవడం విశేషం. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-3, 6-0 తేడాతో సిమోనా హలెప్ (రొమేనియా)ను చిత్తు చేసింది. గ్రూప్ దశలో హలెప్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సెరెనా ఫైనల్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 69 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. మొదటి సెట్లో ఒక దశలో హలెప్ 3-1తో ఆధిక్యంలో నిలిచినా... కోలుకున్న సెరెనా చెలరేగింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను సొంతం చేసుకున్న ఈ అమెరికా ప్లేయర్, రెండో సెట్లో పూర్తి ఆధిక్యం కనబర్చింది. ఓవరాల్‌గా ఐదో డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన సెరెనా, 2014ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది. -
సానియా సువర్ణధ్యాయం
భారత టెన్నిస్ చరిత్రలో సానియా మీర్జా కొత్త అధ్యాయాన్ని లిఖించింది. లియాండర్ పేస్, మహేశ్ భూపతిలాంటి దిగ్గజాలతో సాధ్యంకాని ఘనతను ఈ హైదరాబాద్ అమ్మాయి సాధించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సానియా మీర్జా తన భాగస్వామి కారా బ్లాక్‌తో కలిసి చాంపియన్‌గా అవతరించి పెను సంచలనం సృష్టించింది. సెమీఫైనల్లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గట్టెక్కిన సానియా-కారా బ్లాక్ ద్వయం ఫైనల్లో మాత్రం దుమ్మురేపింది. డిఫెండింగ్ చాంపియన్స్ సు వీ సెయి-షుయె పెంగ్ జంటకు ఒకే ఒక్క గేమ్ కోల్పోయి సానియా-కారా బ్లాక్ జోడీ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. సింగపూర్: తన డబుల్స్ భాగస్వామి కారా బ్లాక్‌కు సానియా మీర్జా చిరస్మరణీయ కానుక ఇచ్చింది. కారా బ్లాక్‌తో కలిసి చివరి టోర్నీ ఆడిన సానియా ఆమెకు టైటిల్‌తో వీడ్కోలు చెప్పింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం విజయఢంకా మోగించింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సానియా-కారా బ్లాక్ 6-1, 6-0తో డిఫెండింగ్ చాంపియన్స్ సు వీ సెయి (చైనీస్ తైపీ)-షుయె పెంగ్ (చైనా) జోడీని చిత్తు చేసింది. ఫైనల్లో ఓడిన సు వీ సెయి వచ్చే సీజన్లో సానియా కొత్త భాగస్వామిగా ఉండబోతుంది. విజేతగా నిలిచిన సానియా జంటకు 5 లక్షల డాలర్ల (రూ. 3 కోట్లు) ప్రైజ్‌మనీతోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ సు వీ సెయి-షుయె పెంగ్లకు 2 లక్షల 50 వేల డాలర్లు (రూ. కోటీ 52 లక్షలు) దక్కాయి. టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా చేతుల మీదుగా సానియా జంట ట్రోఫీని అందుకుంది. కేవలం 59 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో భారత్-జింబాబ్వే జంటకు ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. మ్యాచ్ మొత్తంలో సానియా జోడీ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించడం విశేషం. రెండు సెట్లలో మూడేసి బ్రేక్ పాయింట్లు దక్కాయి. మరోవైపు తమ ప్రత్యర్థికి ఈ ద్వయం ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ఓవరాల్‌గా సానియా జంట మ్యాచ్‌లో వరుసగా 12 గేమ్‌లు గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో ఒక మ్యాచ్ పాయింట్‌ను, సెమీఫైనల్లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని ఫైనల్‌కు చేరిన సానియా జంట ఫైనల్లో మాత్రం ఊహకందని ఆటతీరును కనబరిచింది. షుయె పెంగ్ తొలి సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో ఈ జోడీ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సానియా-కారా బ్లాక్ చెలరేగడంతో షుయె పెంగ్-సు వీ సెయి జంటకు తాము సాధించిన తొలి గేమే మొదటిది, చివరిది అయ్యింది. నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు కచ్చితమైన సర్వీస్, వ్యాలీలతో సానియా జంట పరిపూర్ణ ఆటతీరుతో విజేతగా నిలిచింది. సానియాకిది తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌కాగా... కారా బ్లాక్‌కు మూడోది. 2007, 2008లలో లీజెల్ హుబెర్ (అమెరికా)తో కలిసి కారా బ్లాక్ టైటిల్స్ గెలిచింది. మరో ఆరుసార్లు ఈ జింబాబ్వే క్రీడాకారిణి ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఈ విజయంతో సానియా భారత టెన్నిస్ చరిత్రలో అరుదైన గౌరవాన్ని సాధించింది. సీజన్ ముగింపు టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఆమె నిలిచింది. పురుషుల టెన్నిస్‌లో సీజన్ ముగింపు టోర్నీ అయిన ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో మహేశ్ భూపతి-రోహన్ బోపన్న (2012); మహేశ్ భూపతి-మాక్స్ మిర్నీ (బెలారస్-2010) ఫైనల్‌కు చేరినా రన్నరప్‌గా నిలిచారు. అంతకుముందు టెన్నిస్ మాస్టర్స్ కప్‌గా పేరున్న ఈ టోర్నీలో లియాండర్ పేస్ (భారత్)-నెనాద్ జిమోనిచ్ (సెర్బియా) జంట 2005లో రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీ కంటే ముందు ఏటీపీ టూర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మూడుసార్లు (2000, 1999, 1997) లియాండర్ పేస్-మహేశ్ భూపతి జంట రన్నరప్‌గా నిలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి అంచుల్లో నుంచి గట్టెక్కాం. టెన్నిస్ అంటే అదేమరి. ఈ ఆట ఎల్లప్పుడూ మరో అవకాశం ఇస్తుంది. పోరాడితే తప్పకుండా ఫలితం వస్తుంది. ఈ టోర్నీలో ఈ విషయం రుజువైంది. మా ఇద్దరి ప్రయాణం అద్భుతంగా సాగింది. మా ఇద్దరికీ ఇదే అత్యుత్తమ మ్యాచ్. నా భాగస్వామి కారా బ్లాక్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆమె ఓ గొప్ప చాంపియన్. కారా రూపంలో నాకు గొప్ప స్నేహితురాలు లభించింది. ఆమె నాకు సోదరిలాంటిది. మేమిద్దరం మళ్లీ కలసి ఆడతామో లేదోగానీ మా స్నేహం మాత్రం కలకాలం ఉంటుంది. - సానియా మీర్జా మా భాగస్వామ్యంలో ఆరంభం, ముగింపు అదిరాయి. మూడు పదుల వయసు దాటడంతో ఈ ఆటకు అవసరమైనంతమేర చురుకుగా కదల్లేకపోతున్నాను. సానియా తన కెరీర్లోనే గొప్ప ఫామ్‌లో ఉంది. వచ్చే ఏడాది నేను ఆడతానో లేదో అని యూఎస్ ఓపెన్ సందర్భంగా సానియాకు తెలిపాను. టోర్నీల సమయంలో పాపతో కలిసి ప్రయాణం చేయడం కూడా సులువేం కాదు. కొత్త భాగస్వామిని ఎంచుకొని సానియా నా నిర్ణయాన్ని గౌరవించింది. - కారా బ్లాక్ -
నల్లకలువ చేతిలో నలిగిన రాకెట్
సింగపూర్: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మైదానంలో సహనం కోల్పోయి రాకెట్ ను విరగ్గొట్టింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్ని సెమీఫైనల్ మ్యాచ్ లో సెరెనాకు కోపం వచ్చింది. అంతే చేతిలోని రాకెట్ ను నేలకేసి కొట్టి విరగ్గొట్టింది. శనివారం జరిగిన సెమీస్ లో కరోలైన్ వొజ్నియాకి(డెన్మార్క్)తో సెరెనా తలపడింది. మొదటి సెట్ లో 5-2తో సెరెనా వెనుకడింది. ఈ సమయంలో పాయింట్ కోల్పోవడంతో సెరెనా చిర్రెత్తుకొచ్చింది. చేతిలోని రాకెట్ ను నేలకేసి మూడుసార్లు బాదింది. దీంతో రాకెట్ విరిగిపోయింది. నల్లకలువ చేతిలో నలిగిపోయిన రాకెట్ ను చూసి మైదానంలో ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. అయితే తర్వాత పుంజుకుని సెరెనా ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. కొసమెరుపు: డబ్ల్యూటీఏ ఫైనల్స్ మహిళల సింగిల్స్ టైటిల్ ను సెరెనా గెల్చుకోవడం విశేషం. ఆదివారం జరిగిన తుదిపోరులో సిమోనా హాలెప్ ను 6-3, 6-0తో ఓడించి సెరెనా విజేతగా నిలిచింది. -
ఫైనల్లో సానియా మీర్జా జోడీ
సింగపూర్: మహిళల టెన్నస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌లో సానియా, కారా బ్లాక్ (జింబాబ్వే) 4-6 7-5 11-9 స్కోరుతో క్వెటా పెశెక్ (చెక్ రిపబ్లిక్), స్రెబోట్నిక్ (స్లొవేనియా)పై విజయం సాధించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన పోరులో సానియా జోడీ సూపర్ టై బ్రేక్ మ్యాచ్‌ను వశం చేసుకుంది. సానియా జంట ఫైనల్లో సు-వీ హ్సీ (చైనీస్ తైపీ), ష్వాయ్ పెంగ్ (చైనా)తో తలపడనుంది. -
డబ్ల్యూటీఏ సెమీస్‌కు సానియా జోడీ
సింగపూర్ : సానియా మీర్జా జోడీ సింగపూర్‌లో జరుగుతున్న డబ్ల్యూటీఏ (ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్) సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్స్ ఫైనల్స్‌లో కోప్స్-జోన్స్ జంటపై సానియా, కారా బ్లాక్ జోడీ 6-3, 2-6, 12-10 తేడాతో విజయం సాధించింది. డబ్ల్యూటీఏ సెమీస్‌కు చేరటం సానియాకు ఇదే తొలిసారి. కాగా ఇంతకుముందు ముగ్గురు వేర్వేరు భాగస్వాముల (ఎలెనా లిఖోవ్త్సెవా, రెన్నీ స్టబ్స్, లీజెల్ హ్యుబర్)తో కలసి పదిసార్లు ఈ పోటీల్లో పాల్గొన్న కారా బ్లాక్ ఈసారి సానియాతో కలసి 11వ సారి బరిలోకి దిగింది. ఈ ఏడాది చివర్లో కారా బ్లాక్ టెన్నిస్ నుంచి రిటైర్డ్ కానుంది. -
డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు సానియా జోడి అర్హత
సింగపూర్: టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు భారత స్టార్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే) అర్హత సాధించారు. సింగపూర్ వేదికగా ఈ టోర్నీ వచ్చే నెలలో 20 నుంచి 26వ తేదీ వరకు జరుగుతుంది. ఈ మెగా టోర్నీకి సానియా అర్హత సాధించడం ఇదే తొలిసారికాగా... కారా బ్లాక్ 11వసారి పాల్గొననుంది. ఏడాది మొత్తంలో డబుల్స్ విభాగంలో అత్యుత్తమంగా రాణించిన ఎనిమిది జోడిలు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. సానియా-కారా బ్లాక్ నాలుగో జోడిగా ఈ టోర్నీకి అర్హత పొందింది. ఈ ఏడాది సానియా-కారా బ్లాక్ ద్వయం రెండు టైటిల్స్ సాధించడంతోపాటు మూడు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. ‘డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీకి అర్హత పొందడంతో చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నీలో నేను తొలిసారి పాల్గొంటున్నాను. మా ఇద్దరికీ ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. అదే జోరును ఈ టోర్నీలోనూ కొనసాగిస్తామని ఆశిస్తున్నాను’ అని ప్రస్తుతం ఆసియా క్రీడల్లో ఆడేందుకు ఇంచియాన్‌లో ఉన్న సానియా మీర్జా వ్యాఖ్యానించింది.