ట్రోఫీతో యాష్లే బార్టీ
షెన్‌జెన్ (చైనా): మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో యాష్లే బార్టీ 6–4, 6–3తో డిఫెండింగ్ చాంపియన్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. గతంలో స్వితోలినాతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన బార్టీ మెగా ఫైనల్లో మాత్రం తన ఆధిపత్యాన్ని చాటుకుంది. విజేతగా నిలిచిన యాష్లే బార్టీకి 44 లక్షల 20 వేల డాలర్లు (రూ. 31 కోట్ల 17 లక్షలు).... రన్నరప్ స్వితోలినాకు 24 లక్షల డాలర్లు (రూ. 16 కోట్ల 92 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓ టెన్నిస్ టోర్నమెంట్‌లో విజేతకు ఇంత భారీ మొత్తం ప్రైజ్‌మనీ ఇవ్వడం ఇదే తొలిసారి.
గతేడాది సింగపూర్‌లో జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత స్వితోలినా ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఈ టోర్నీలో స్వితోలినా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గడంతోపాటు సెమీఫైనల్లోనూ గెలిచి ఫైనల్ చేరింది. ఒకవేళ స్వితోలినా ఫైనల్లో గెలిచుంటే టోర్నీ నిబంధనల ప్రకారం అజేయంగా నిలిచినందుకు ఆమెకు 47 లక్షల 25 వేల డాలర్లు (రూ. 33 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించేవి. 86 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బార్టీ తొలి సెట్ పదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను గెల్చుకుంది. రెండో సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డా... ఎనిమిదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని బార్టీ విజేతగా నిలిచింది.
ఈ ఏడాది బార్టీ మొత్తం నాలుగు టైటిల్స్ సాధించింది. సీజన్‌ను 15వ ర్యాంక్‌తో ప్రారంభించిన బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఆ తర్వాత మయామి ఓపెన్‌లో... ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. బర్మింగ్‌హమ్ ఓపెన్‌లోనూ టైటిల్ సాధించి కెరీర్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఈ ఏడాదిని ఆమె నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనుంది.
2 ఇవాన్ గూలాగాంగ్ (1976లో) తర్వాత డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ టైటిల్ సాధించిన రెండో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా యాష్లే బార్టీ నిలిచింది.
5 సీజన్ ముగింపు టోర్నీ ఫైనల్స్‌లో బరిలోకి దిగిన తొలిసారే విజేతగా అవతరించిన ఐదో క్రీడాకారిణిగా బార్టీ గుర్తింపు పొందింది. గతంలో సెరెనా విలియమ్స్ (అమెరికా–2001లో), మరియా షరపోవా (రష్యా–2004లో), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్–2011లో), సిబుల్కోవా (స్లొవేకియా–2016లో) ఈ ఘనత సాధించారు.
బాబోస్–మ్లాడెనోవిచ్ జంటకు డబుల్స్ టైటిల్
డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ డబుల్స్ విభాగంలో తిమియా బాబోస్ (హంగేరి)–క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట టైటిల్ సాధించింది. ఫైనల్లో ఈ జంట 6–1, 6–3తో సు వె సెయి (చైనీస్ తైపీ)–
బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలిచింది. టోర్నీ మొత్తంలో అజేయంగా నిలిచినందుకు తిమియా–క్రిస్టినా జంటకు 10 లక్షల డాలర్ల (రూ. 7 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment