మున్రో మెరుపు ఇన్నింగ్స్‌ వృధా.. తుక్కు రేగ్గొట్టిన రసెల్‌   | CPL 2023: Trinbago Knight Riders Beat Saint Lucia Kings By 7 Wickets | Sakshi
Sakshi News home page

CPL 2023: మున్రో మెరుపు ఇన్నింగ్స్‌ వృధా.. తుక్కు రేగ్గొట్టిన రసెల్‌

Published Mon, Sep 11 2023 5:07 PM | Last Updated on Mon, Sep 11 2023 5:19 PM

CPL 2023: Trinbago Knight Riders Beat Saint Lucia Kings By 7 Wickets - Sakshi

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో భాగంగా సెయింట్‌ లూసియా కింగ్స్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 11) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లూసియా కింగ్స్‌.. ఓపెనర్‌ కొలిన్‌ మున్రో (51 బంతుల్లో 72 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన అజేయ అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. మార్క్‌ దెయాల్‌ (45 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో, ఆఖర్లో ఆండ్రీ రసెల్‌ (13 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నైట్‌రైడర్స్‌ మరో 7 బంతులు మిగిలుండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. 

మున్రో మెరుపు ఇన్నింగ్స్‌ వృధా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లూసియా కింగ్స్‌ను మున్రో  బాధ్యతాయుతమైన అజేయ అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. అతను చివరి వరకు క్రీజ్‌లో ఉండటంతో లూసియా కింగ్స్‌ ఈ మాత్రం స్కోరైనా (167/3) చేయగలిగింది. మున్రోకు రోస్టన్‌ ఛేజ్‌ (31 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్‌), సీన్‌ విలియమ్స్‌ (17 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) సహకరించగా.. జాన్సన్‌ చార్లెస్‌ (13), సికందర్‌ రజా (8) విఫలమయ్యారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌, సునీల్‌ నరైన్‌, వకార్‌ సలామ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

రాణించిన మార్క్‌ దెయాల్‌, రఫ్ఫాడించిన రసెల్‌
168 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ మార్క్‌ దెయాల్‌, ఆఖర్లో ఆండ్రీ రసెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించడంతో 18.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో మార్టిన్‌ గప్తిల్‌ (16), నికోలస్‌ పూరన్‌ (15) విఫలం కాగా.. దెయాల్‌, రసెల్‌తో పాటు లోర్కాన్‌ టక్కర్‌ (38 నాటౌట్‌) రాణించాడు. లూసియా బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. రోస్టన్‌ ఛేజ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement