కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మరో విజయం సాధించింది. గయానా అమెజాన్ వారియర్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. నైట్ రైడర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
రసెల్ విధ్వంసం
149 పరుగుల లక్ష్య ఛేదనలో నైట్ రైడర్స్ 89 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆండ్రీ రసెల్ (36).. టిమ్ డేవిడ్‌తో (31) కలిసి నైట్ రైడర్స్‌ను గెలిపించాడు. రసెల్ 15 బంతుల్లో బౌండరీ, నాలుగు సిక్సర్ల సాయంతో విధ్వంసం సృష్టించాడు. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో సునీల్ నరైన్ (11), పూరన్ (10), పోలార్డ్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
షెపర్డ్ మెరుపు హాఫ్ సెంచరీ
అంతకుముందు రొమారియో షెపర్డ్ మెరుపు హాఫ్ సెంచరీతో (24 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వారియర్స్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. టిమ్ రాబిన్సన్ (34), ప్రిటోరియస్ (21 నాటౌట్), మొయిన్ అలీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్, వకార్ సలాంఖీల్ తలో రెండు, బ్రావో, అకీల్ హొసేన్ చెరో వికెట్ పడగొట్టారు.
కాగా, ఈ సీజన్‌లో నైట్ రైడర్స్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన బార్బడోస్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ చివరి నుంచి రెండు స్థానాల్లో ఉన్నాయి.
చదవండి: IND VS BAN 1st Test: నిరాశపరిచిన రోహిత్
Comments
Please login to add a commentAdd a comment