India VS Pakistan Matches: భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరుగకపోతే మెగా క్రికెట్ ఈవెంట్లకు ఆదరణ తగ్గిపోయే అవకాశం ఉందని పాక్ మాజీ కెప్టెన్ ఇంతిఖాబ్ ఆలం అన్నాడు. దాయాదుల పోరు వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలికి భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోందన్న అతడు.. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరుగకపోతే నష్టం చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నాడు. రాజకీయాలకు అతీతంగా ఆట సాగాలని ఆకాంక్షించాడు.
కాగా ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. వన్డే వరల్డ్‌కప్-2023 భారత్ వేదికగా జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీ ఆడేందుకు టీమిండియాను పాక్‌కు పంపే ప్రసక్తి లేదని బీసీసీఐ తేల్చి చెప్పగా.. పాక్ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాలపై స్పందించిన ఇంతిఖాబ్ ఆలం.. భారత్- పాక్ మ్యాచ్‌లు జరిగితేనే క్రికెట్ మనుగడ కొనసాగుతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేశాడు.
కూర్చుని మాట్లాడుకుంటే సరి!
కూర్చుని మాట్లాడుకుంటే పరిస్థితులు చక్కబడతాయని.. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రయత్నం చేయాలే తప్ప పెంచకూడదని పేర్కొన్నాడు. ఇక హైబ్రిడ్ మోడల్ చెత్తగా ఉందని.. పాకిస్తాన్‌లో కేవలం నాలుగైదు మ్యాచ్‌లు ఆడితే ఏం ప్రయోజనం ఉంటుందని ఆలం ప్రశ్నించాడు.
ఇలాంటి విధానం వల్ల తమకు నష్టం జరుగుతుందని.. వరల్డ్‌కప్ సమయంలో తాము కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే మ్యాచ్‌లు ఆడతామని పాక్ భీష్మించుకు కూర్చుంటే పరిస్థితి ఏమిటని వాపోయాడు. మెగా ఈవెంట్లలో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ మధ్య మ్యాచ్‌లు జరిగితేనే ఆదరణ మరింత పెరుగుతుందన్న ఇంతిఖాబ్ ఆలం.. ఆటగాళ్ల మధ్య రాజకీయాలకు అతీతంగా స్నేహభావం పెంపొందితే చూడాలని ఉందని పేర్కొన్నాడు.
ప్రేమను పెంచుతుంది
క్రికెట్ ఇరు దేశాల మధ్య స్నేహం, ప్రేమను పెంచడానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. కాగా భారత ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ విముఖత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడి పరిస్థితుల దృష్ట్యా తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహిస్తే ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు గతంలో తెలిపారు.
చదవండి: IND vs WI: కిషన్, భరత్‌కు నో ఛాన్స్.. భారత జట్టులోకి యువ వికెట్ కీపర్!
న్యూ మిస్టర్ కూల్ అంటూ ప్రశంసల వర్షం.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment