లండన్: భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లాగే ఇకపై న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల జట్ల మధ్య ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’ నిర్వహించనున్నారు. న్యూజిలాండ్ దివంగత దిగ్గజం మార్టిన్ క్రో, ఇంగ్లండ్ దివంగత లెజెండ్ గ్రాహం థోర్ప్‌ల పేరిట ఈ ఏడాది నుంచి ద్వైపాక్షిక సిరీస్ అంకురార్పణ జరగనుంది. విజేతకు బహూకరించే ట్రోఫీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల బ్యాట్‌లను ఉపయోగించి ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’ని రూపొందించారు.
న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ డేవిడ్ ఎన్‌గవాటి ఈ కలప (బ్యాట్) ట్రోఫీని తయారు చేశారు. ప్రపంచ శ్రేణి కళాకృతులను, వినియోగదారుల అభిరుచులకు తగ్గ ఆకృతులను (కస్టమ్ డిజైన్) తయారు చేయడంలో ‘మహు క్రియేటివ్’ సంస్థకు మంచి పేరుంది. డేవిడ్‌కు చెందిన ఈ సంస్థే గతంలో కివీస్, సఫారీల మధ్య జరిగిన టోర్నీ కోసం ‘తంగివాయ్ షీల్డ్’ను రూపొందించింది. దిగ్గజ క్రికెటర్ల విషయానికొస్తే అసలైన క్రికెట్ ఫార్మాట్ (టెస్టు)లో అటు మారి్టన్ క్రో... ఇటు గ్రాహం థోర్ప్ అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన ముద్ర వేశారు.
తన కెరీర్‌లో 77 టెస్టులాడిన క్రో 45.36 సగటుతో 5444 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 18 అర్ధసెంచరీలున్నాయి. 143 వన్డేల్లో 38.55 సగటుతో 4704 పరుగులు సాధించాడు. 4 శతకాలు, 34 అర్ధశతకాలు బాదాడు. థోర్ప్ సరిగ్గా 100 టెస్టులాడాడు. 44.66 సగటుతో 6744 పరుగులు చేశాడు. 16 సెంచరీలు, 39 ఫిఫ్టీలున్నాయి. వన్డే కెరీర్‌లో 82 మ్యాచ్‌ల్లో 37.18 సగటుతో 2380 పరుగులు చేశాడు. 21 అర్ధసెంచరీలున్నాయి. సాధారణంగా క్రికెట్ ట్రోఫీలన్నీ లోహం (మెటల్)తోనే తయారవుతాయి.
కానీ ‘కో–థోర్ప్ ట్రోఫీ’ మాత్రం భిన్నమైంది. ఇరు దిగ్గజ క్రికెటర్ల కుటుంబాలు బ్యాట్లు ఇవ్వడంతో డేవిడ్ తన నైపుణ్యంతో కలప ‘టోఫీ’గా మలిచాడు. దీన్ని మారి్టన్ సోదరి డెబ్ క్రో, మాజీ ఇంగ్లండ్ సారథి మైకేల్ అథర్టన్ కలిసి గురువారం క్రైస్ట్‌చర్చ్‌లో మొదలయ్యే తొలి టెస్టు సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment