ఫ్యాన్‌కు సీఎస్‌కే అదిరిపోయే రిప్లై CSK Stunning Reply To Fan Asking Who Is Vice Captain Now | Sakshi
Sakshi News home page

వైజ్‌ కెప్టెన్‌ ఉన్నాడు.. వైస్‌ కెప్టెన్‌ ఎందుకు?

Published Thu, Sep 3 2020 2:25 PM | Last Updated on Sat, Sep 19 2020 3:46 PM

CSK Stunning Reply To Fan Asking Who Is Vice Captain Now - Sakshi

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కోసం యూఏఈలో అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆదిలోనే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. 13 మంది సీఎస్‌కే సభ్యులు కరోనా బారిన పడటం ఒకటైతే, రెండోది వైస్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనా తిరిగి స్వదేశానికి వచ్చేయడం. అయితే 13 మంది సీఎస్‌కే సభ్యులకు మరొకసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ రావడంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. ఇదిలాఉంచితే, కీలక ఆటగాడైన రైనా  తిరిగి జట్టుతో కలవడమనేది ఇంకా డైలమాలోనే ఉంది. జట్టుతో తనకేమీ పొరపచ్చలు  లేవని, అవకాశం ఉంటే జట్టుతో కలుస్తాననే సంకేతాలు పంపాడు. (చదవండి: బీసీసీఐ మెడికల్‌ టీమ్‌కు పాకిన కరోనా)

తన కుటుంబంపై కొంతమంది దాడి చేసిన ఘటనలో మేనమామ చనిపోయిన కారణంగానే స్వదేశానికి ఉన్నపళంగా రావాల్సివచ్చిందని రైనా వివరణ ఇచ్చుకున్నాడు.తనకు జట్టుతో ఎటువంటి విభేదాలు లేవని కూడా తెలిపాడు. దీనిపై సీఎస్‌కే యజమాని ఎన్‌ శ్రీనివాసన్‌ కూడా సానుకూలంగానే స్పందించారు. తనకు రైనా కొడుకు లాంటి వాడు అంటూ శ్రీని స్పష్టం చేశారు. దాంతో సీఎస్‌కేతో రైనాకు విభేదాలు అంశానికి తొందరగానే ముగింపు పడింది. ఈ క్రమంలోనే రైనా జట్టుతో కలిసినా అది టోర్నీ మధ్యలోనే జరగవచ్చని తమ ప్రశ్నలకు తామే బదులిచ్చుకుంటున్నారు సీఎస్‌కే అభిమానులు.

కాగా, ఒక అభిమాని ఉండబట్టలేక సోషల్‌ మీడియాలో సీఎస్‌కేను ఒక ప్రశ్న అడిగేశాడు. ‘ ఇప్పుడు మన వైస్‌ కెప్టెన్‌ ఎవరు?’ అంటూ తన మనసులోని గందరగోళానికి తెరపెట్టాలనే యత్నం​ చేశాడు. దీనికి సీఎస్‌కే తమిళంలోనే అదిరిపోయే సమాధానమిచ్చింది. ‘మనకు వైజ్‌(తెలివైన) కెప్టెన్‌ ఉండగా, వైస్‌ కెప్టెన్‌ కోసం ఎందుకు ఆందోళన చెందుతున్నారు?’ అంటూ బదులిచ్చింది. ఇక్కడ సీఎస్‌కే ఎంఎస్‌ ధోని గురించి పరోక్షంగా ప్రస్తావించింది. మూడు ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచిన కెప్టెన్‌ ఉన్నప్పుడు, వైస్‌ కెప్టెన్‌ చర్చ అనవసరం అని చెప్పకనే చెప్పేసింది సీఎస్‌​కే. (చదవండి: ‘మాది తండ్రీ కొడుకుల బంధం’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement