CSK Vs MI: Chennai Super Kings Won By 20 Runs, గైక్వాడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌.. చెన్నైదే పైచేయి - Sakshi
Sakshi News home page

CSK vs MI: గైక్వాడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌.. చెన్నైదే పైచేయి

Published Mon, Sep 20 2021 3:04 AM | Last Updated on Mon, Sep 20 2021 9:12 AM

CSK vs MI: Chennai Super Kings Won By 20 Runs - Sakshi

రుతురాజ్‌ గైక్వాడ్‌

దుబాయ్‌: ఒకదశలో చెన్నై స్కోరు 24/4... కీలక బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరారు... ఈ దశలో యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అన్నీతానై (58 బంతుల్లో 88 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రుతురాజ్‌తోపాటు రవీంద్ర జడేజా (33 బంతుల్లో 26; 1 ఫోర్‌), డ్వేన్‌ బ్రావో (8 బంతుల్లో 23; 3 సిక్స్‌లు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. దాంతో ముంబై ఇండియన్స్‌కు చెన్నై గౌరవప్రద లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించి ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేశారు. ఫలితంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె తొలి మ్యాచ్‌లో చెన్నై 20 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై గెలిచింది.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు సాధించింది. ముంబై బౌలర్లలో ఆడమ్‌ మిల్నే, బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ తలా రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడింది. సౌరభ్‌ తివారీ (40 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు బ్రావో (3/25), దీపక్‌ చహర్‌ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. మోకాలి గాయంతో ముంబై రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంకాగా. పొలార్డ్‌ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.   



రుతురాజసం...  
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైని ముంబై పేసర్లు బౌల్ట్, మిల్నేలు నిప్పులు చెరిగే బంతులతో హడలెత్తించారు. వీరిధాటికి డు ప్లెసిస్‌ (0), రైనా (4) మొయిన్‌ అలీ (0), కెప్టెన్‌ ధోని (3) వెంట వెంటనే పెవిలియన్‌కు చేరారు. మిల్నే బంతికి గాయపడ్డ అంబటి రాయుడు (0) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. దాంతో చెన్నై పవర్‌ప్లే ముగిసేసరికి 24/4గా నిలిచింది. అయితే రుతురాజ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. తన వ్యక్తిగత స్కోరు 19 పరుగుల వద్ద కీపర్‌ డికాక్‌ క్యాచ్‌ను జారవిడవడంతో ఊపిరి పీల్చుకున్న రుతురాజ్‌... ఆ తర్వాత ఎటువంటి పొరపాటు చేయలేదు. జడేజాతో కలిసి జట్టు స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలో అతను చూడ చక్కని షాట్లు ఆడుతూ 41 బంతుల్లో ఐపీఎల్‌లో తన ఆరో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. జడేజా అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన బ్రావో దూకుడుగా ఆడాడు. 19వ ఓవర్లో బ్రావో, రుతురాజ్‌ ధాటిగా ఆడటంతో ఆ ఓవర్లో చెన్నైకి 24 పరుగులు లభించాయి. బుమ్రా వేసిన చివరి ఓవర్‌ మూడో బంతికి ఫోర్‌ కొట్టిన రుతురాజ్‌.. ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. చివరి ఐదు ఓవర్లలో ముంబై 69 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.
 
ఛేజింగ్‌లో ముంబై బోల్తా 
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైని చెనై బౌలర్లు దెబ్బ తీశారు. ఓపెనర్లు డికాక్‌ (17; 3 ఫోర్లు), అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (16; 2 ఫోర్లు, 1 సిక్స్‌)లను దీపక్‌ చహర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ వెంటనే సూర్యకుమార్‌ యాదవ్‌ (3), ఇషాన్‌ కిషన్‌ (11)లు కూడా అవుటయ్యారు. ఒక ఎండ్‌లో సౌరభ్‌ తివారీ ఆడుతున్నా అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ కరువయ్యాడు. గెలిపిస్తాడనుకున్న పొలార్డ్‌ (15) కీలక సమయంలో ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో మిల్నే సాయంతో తివారీ కాసేపు చెన్నై బౌలర్లను ప్రతిఘటించాడు. చివరి ఓవర్లో ముంబై గెలుపునకు 24 పరుగులు అవసరంకాగా... ముంబై  3 పరుగులు మాత్రమే చేయగలిగింది.  

స్కోరు వివరాలు 
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌ (నాటౌట్‌) 88; డు ప్లెసిస్‌ (సి) మిల్నే (బి) బౌల్ట్‌ 0; మొయిన్‌ అలీ (సి) తివారీ (బి) మిల్నే 0; అంబటి రాయుడు (రిటైర్డ్‌ హర్ట్‌) 0; రైనా (సి) రాహుల్‌ చహర్‌ (బి) బౌల్ట్‌ 4; ధోని (సి) బౌల్ట్‌ (బి) మిల్నే 3; జడేజా (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 26; బ్రావో (సి) కృనాల్‌  (బి) బుమ్రా 23; శార్దుల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156.  
వికెట్ల పతనం: 1–1, 2–2, 3–7, 4–24, 5–105, 6–144. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–1–35–2, మిల్నే 4–0–21–2, బుమ్రా 4–0–33–2, పొలార్డ్‌ 2–0–15–0, రాహుల్‌ చహర్‌ 4–0–22–0, కృనాల్‌ పాండ్యా 2–0–27–0. 

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (ఎల్బీ) (బి) దీపక్‌ చహర్‌ 17; అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (బి) దీపక్‌ చహర్‌ 16; సూర్యకుమార్‌ (సి) డు ప్లెసిస్‌ (బి) శార్దుల్‌ 3; ఇషాన్‌ కిషన్‌ (సి) రైనా (బి) బ్రావో 11; సౌరభ్‌ తివారీ (నాటౌట్‌) 50; పొలార్డ్‌ (ఎల్బీ) (బి) హేజల్‌వుడ్‌ 15; కృనాల్‌ (రనౌట్‌) 4; మిల్నే (సి) (సబ్‌) గౌతమ్‌ (బి) బ్రావో 15; రాహుల్‌ చహర్‌ (సి) రైనా (బి) బ్రావో 0; బుమ్రా (నాటౌట్‌) 1;  ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 136. 
వికెట్ల పతనం: 1–18, 2–35, 3–37, 4–58, 5–87, 6–94, 7–134, 8–135. 
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–18–2, హేజల్‌వుడ్‌ 4–0–34–1, శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–29–1, మొయిన్‌ అలీ 3–0–16–0, డ్వేన్‌ బ్రావో 4–0–25–3, రవీంద్ర జడేజా 1–0–13–0.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement