T20 World Cup 2021 IRE Vs NED: Curtis Campher Of Ireland Takes 4 Wickets In 4 Balls Against Netherlands - Sakshi
Sakshi News home page

T20 World Cup IRE Vs NED: కర్టిస్‌ సంచలనం.. 4 బంతుల్లో 4 వికెట్లు!

Published Tue, Oct 19 2021 5:34 AM | Last Updated on Tue, Oct 19 2021 1:44 PM

Curtis Campher Of Ireland Takes 4 Wickets In 4 Balls Against Netherlands In T20 World Cup - Sakshi

అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో సోమవారం అద్భుతం చోటు చేసుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫయింగ్‌ రౌండ్‌ గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ బౌలర్‌ కర్టిస్‌ క్యాంఫర్‌ 4 వరుస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పదో ఓవర్‌లోని రెండో బంతికి కోలిన్‌ అకెర్‌మాన్‌ (11)ను, మూడో బంతికి ర్యాన్‌ టెన్‌ డషెట్‌ (0)ను, నాలుగో బంతికి స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (0)ను, ఐదో బంతికి వాన్‌ డెర్‌ మార్వె (0)లను అవుట్‌ చేసిన కర్టిస్‌ హ్యాట్రిక్‌ పూర్తి చేసుకోవడంతోపాటు తన ఖాతాలో నాలుగు వికెట్లు జమచేసుకున్నాడు.

ఈ క్రమంలో హ్యాట్రిక్‌ సాధించిన తొలి ఐర్లాండ్‌ బౌలర్‌గా కర్టిస్‌ గుర్తింపు పొందాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కర్టిస్‌ (4/26), మార్క్‌ అడైర్‌ (3/9) దెబ్బకు నెదర్లాండ్స్‌ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్‌ జట్టులో మ్యాక్స్‌ ఒ డౌడ్‌ (47 బంతుల్లో 51; 7 ఫోర్లు) మినహా మిగిలినవారు విఫలమయ్యారు. అనంతరం ఐర్లాండ్‌ జట్టు 15.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 107 పరుగులు చేసి ఏడు వికెట్లతో గెలుపొందింది. డెలానీ (29 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), పాల్‌ స్టిర్లింగ్‌ (39 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు.

►అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసిన మూడో బౌలర్‌ కర్టిస్‌. గతంలో లసిత్‌ మలింగ (శ్రీలంక; న్యూజిలాండ్‌పై 2019లో), రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్తాన్‌; ఐర్లాండ్‌పై 2019లో) ఈ ఘనత సాధించారు. లసిత్‌ మలింగ వన్డే క్రికెట్‌లోనూ ఈ అద్భుతం చేశాడు. 2007 వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీశాడు.

►టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన రెండో బౌలర్‌ కర్టిస్‌. గతంలో ఆస్ట్రేలియా బౌలర్‌ బ్రెట్‌ లీ (2007లో బంగ్లాదేశ్‌పై) మాత్రమే ఈ ఘనత సాధించాడు.

►అంతర్జాతీయ టి20ల్లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన 19వ బౌలర్‌గా కర్టిస్‌ నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement