వెల్లింగ్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియాపై అద్భుత విజయాన్ని సాధించి స్వదేశానికి చేరుకున్న న్యూజిలాండ్ జట్టుకు కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించిందని ఆ జట్టు పేసర్ నీల్ వాగ్నర్ వెల్లడించాడు. శుక్రవారం స్వదేశంలో ల్యాండ్ కాగానే అభిమానుల నుంచి భారీ ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయని, ఐసీసీ బహుకరించిన గదతో ఫోటోలు దిగేందుకు వారంతా ఎగబడ్డారని ఆయన తెలిపాడు. విమానాశ్రయంలోనూ కస్టమ్స్ అధికారులయితే, పాస్ పోర్టులు లాక్కొని మరీ ఐసీసీ గద కోసం ఆరా తీశారని, గదతో ఫోటోలు దిగేందుకు వారు సైతం అలా ఎగబడడం చూసి చాలా గర్వంగా ఫీలయ్యామని, గదను పట్టుకున్నప్పుడు వారి ముఖాల్లో చిరునవ్వులు చూడటం అద్భుతంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.
ఈ అనుభూతి వర్ణణాతీతమని, ఛాంపియన్ జట్టుకు ఇంత గౌరవం లభిస్తుందని ఊహించలేదని పేర్కొన్నాడు. అయితే, కరోనా నిబంధనల కారణంగా అభిమానులకు దూరం నుంచే అభివాదం చేయాల్సి వచ్చిందని, గదతో ఫోటోలు దిగాలన్న అభిమానుల కోరిక నెరవేరలేదని ఆయన వివరించాడు. అయిప్పటికీ తమ దేశ అభిమానులు ఎంతో సంయమనం పాటించారని, రూల్స్ వ్యతిరేకంగా ప్రవర్తించకుండా హుందాగా వ్యవహరించారని, వారి అభిమానం వెలకట్టలేనిదని తెలిపాడు.
జట్టు సభ్యులందరికీ అభిమానులతో కలిసి సంబురాలు చేసుకోవాలని ఉండిందని, అయితే అలాంటి పరిస్థితులు లేకపోవడం బాధించిందని విచారం వ్యక్తం చేశాడు. తాము కూడా రాత్రంతా తలా కాసేపు గదను పట్టుకుని సంబర పడ్డామని, జట్టు వికెట్ కీపర్ వాట్లింగ్‌కు డబ్ల్యూటీసీ ఫైనలే చివరి మ్యాచ్ కావడంతో ఐసోలేషన్ కంప్లీట్ అయ్యేవరకు గదను అతని దగ్గరే ఉంచాలని నిర్ణయించుకున్నామని వెల్లడించాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించిన కివీస్.. తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. ఇందుకు గాను ఆ జట్టుకు రూ.11.67 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు ఐసీసీ.. ఓ గదను బహుకరించింది.
చదవండి: WTC Final: ‘ఒక్క గంట ఆట, ఇమేజ్ మొత్తం డ్యామేజ్’
Comments
Please login to add a commentAdd a comment