2023 వన్డే ప్రపంచకప్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే రెండు అగ్రశ్రేణి జట్లకు పసికూనలు షాకిచ్చాయి. అక్టోబర్ 15న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాకివ్వగా.. నిన్న (అక్టోబర్ 17) ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది.
రెండు రోజుల వ్యవధిలో రెండు సంచనాలు నమోదు కావడంతో ఇవాళ (అక్టోబర్ 18) జరిగే ఆఫ్ఘనిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి అద్భుతం చేసి న్యూజిలాండ్‌ను మట్టికరిపిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మ్యాచ్‌కు వేదిక అయిన చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఆఫ్ఘన్ స్పిన్నర్లు మరోసారి మాయ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇంగ్లండ్‌పై గెలుపు ఇచ్చిన జోష్‌లో ఉరకలేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు న్యూజిలాండ్‌ను సైతం ఖంగుతినిపించగలమని ధీమాగా ఉన్నారు. గత మ్యాచ్‌లో లాగా ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లు రాణిస్తే, మిగతా పనిని స్పిన్నర్లు చూసుకుంటారని ఆఫ్ఘన్ అభిమానులు అంటున్నారు.
మరోవైపు ఈ ఎడిషన్‌లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ కూడా గెలుపుపై అంతే ధీమాగా ఉంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో కలిసికట్టుగా రాణించి, ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించారు. బ్యాటింగ్‌లో డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ భీకర ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ చెలరేగిపోతున్నారు. కివీస్ జట్టులో ప్రతి ఆటగాడు మాంచి టచ్‌లో ఉండటంతో ఆఫ్ఘన్లను ఓడించిడం వారికి అంత కష్టమైన పనికాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధిస్తుందో లేక కివీస్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తుందో వేచి చూడాలి.
కాగా, న్యూజిలాండ్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో మూడింట గెలుపొంది, పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో ఉండగా.. 3 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్ ఆరో స్థానంలో కొనసాగుతుంది. న్యూజిలాండ్ వరుసగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లపై విజయాలు సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో, రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిపాలై, మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.
న్యూజిలాండ్‌దే పైచేయి..
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటివరకు రెండు సార్లు (2015, 2019) ఎదురెదురుపడగా.. రెండు సందర్భాల్లో న్యూజిలాండే గెలుపొందింది. 2015 వరల్డ్‌కప్‌లో 6 వికెట్ల తేడాతో, 2019లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment