52 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ఆస్ట్రేలియా ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌ను గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రస్తుత ప్రపంచకప్‌లో సాధించాడు. వన్డే క్రికెట్ ప్రారంభమైన నాటి నుంచి (1971 జనవరి 5) ఆస్ట్రేలియన్లకు అందని ద్రాక్షగా ఉండిన డబుల్ సెంచరీని మ్యాక్సీ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 128 బంతులు ఎదుర్కొన్న అతను 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో అజేయమైన డబుల్ సెంచరీ (201) చేసి, తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక స్కోర్ కూడా ఇదే కావడం విశేషం.
ఆఫ్ఘన్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో మ్యాక్సీ మరిన్ని రికార్డులు సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటంటే..
- ప్రపంచకప్ చరిత్రలో మూడో డబుల్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు. గతంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్; వెస్టిండీస్‌పై 2015లో వెల్లింగ్టన్‌లో), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (215; జింబాబ్వేపై 2015లో కాన్‌బెర్రాలో) ఈ ఘనత సాధించారు.
- వన్డేల్లో రెండో వేగవంతంగా డబుల్ సెంచరీ (128 బంతుల్లో) రికార్డు. ఈ విభాగంలో అత్యుత్తమ రికార్డు టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ (126 బంతుల్లో; 2022లో బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో) పేరిట ఉంది.
- వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా రికార్డు. పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ (193; 2021లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బర్గ్‌లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ సవరించాడు.
- ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో మూడో స్థానం (43 సిక్సర్లు).ఈ విభాగంలో క్రిస్ గేల్ (49), రోహిత్ శర్మ (45) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- ఓ వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో ఐదో అత్యధిక సిక్సర్ల రికార్డు (ఆఫ్ఘనిస్తాన్‌పై 10 సిక్సర్లు). ఈ విభాగంలో ఇయాన్ మోర్గాన్ (2019లో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో 17 సిక్సర్లు) టాప్‌లో ఉన్నాడు.
- వన్డేల్లో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (కమిన్స్‌తో కలిసి అజేయమైన 202 పరుగులు)
- వన్డేల్లో నాన్ ఓపెనర్‌గా అత్యధిక స్కోర్ రికార్డు. గతంలో వన్డేల్లో ఈ రికార్డు జింబాబ్వే ఆటగాడు చార్లెస్ కొవెంట్రీ (194 నాటౌట్) పేరిట ఉండేది.
- ఆరు లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ (175 నాటౌట్) పేరిట ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment