వన్డే ప్రపంచకప్ 2023లో మరో పెను సంచలనం నమోదైంది. అక్టోబర్ 15న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాకివ్వగా.. నిన్న (అక్టోబర్ 17) ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది.
వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసి, ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని, ఓవరాల్‌గా (ప్రపంచకప్ టోర్నీల్లో) మూడో గెలుపును (నమీబియా, స్కాట్లాండ్, సౌతాఫ్రికా) సొంతం చేసుకుంది.
మరోవైపు సౌతాఫ్రికా.. టెస్ట్ అర్హత సాధించని దేశంపై (నెదర్లాండ్స్) తొలిసారి ఓటమి చవిచూసింది. సౌతాఫ్రికాకు ఐసీసీ టోర్నీలో నెదర్లాండ్స్ చేతిలో ఓటమి కొత్తేమీ కాదు. 2022 టీ20 వరల్డ్‌కప్‌లో డచ్ టీమ్ సఫారీలకు భారీ షాకిచ్చింది. ఆ టోర్నీ సూపర్ 12 మ్యాచ్‌లో నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాపై 13 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇదిలా ఉంటే, నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) రాణించడంతో 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో ఎంగిడి, మార్కో జన్సెన్, రబాడ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కొయెట్జీ, కేశవ్ మహారాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. డచ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది. లొగాన్ వాన్ బీక్ (3/60), పాల్ వాన్ మీకెరెన్ (2/40), వాన్ డర్ మెర్వ్ (2/34), బాస్ డి లీడ్ (2/36), అకెర్‌మెన్ (1/16) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment