కరాచీ: దక్షిణాఫ్రికా సీనియర్ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో ఆటగాళ్లు కేవలం డబ్బులు కోసం మాత్రమే ఆడుతారని.. కానీ పీఎస్‌ఎల్, మిగతా లీగ్స్ ద్వారా ఆటగాళ్లు మంచి హోదా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. తాజాగా స్టెయిన్ పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో స్టెయిన్ వివరించాడు.
''ఐపీఎల్‌లో పాల్గొనేవి అన్ని పెద్ద జట్లే. ఆటగాళ్ల కోసం కోట్లు గుమ్మరిస్తుంటాయి. అయితే ఐపీఎల్‌లో ఆట కంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అదే పీఎస్‌ఎల్, లంక ప్రీమియర్ లీగ్‌లో చూసుకుంటే అక్కడ డబ్బుల కంటే ఆటకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. పీఎస్‌ఎల్‌లో ఆడిన కొన్ని రోజుల్లోనే నాకు ఈ విషయం అర్థమయింది. నేను ఆడుతున్న జట్టులోనే నా సహచర ఆటగాళ్లు నా దగ్గరనుంచి ఆటకు సంబంధించిన మెళుకువలు అడిగారే తప్ప ఎంత డబ్బు పొందుతున్నావు అని అడగలేదు. కానీ అదే ఐపీఎల్‌లో మాత్రం ఇద్దరి మధ్య చర్చ ఉందంటే.. నువ్వు ఎంతకు అమ్ముడపోయావనే మాట మొదటగా వినిపిస్తుంది. అందుకే ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనుకున్నా'' అంటూ వివరించాడు.
కాగా డేల్ స్టెయిన్ గతేడాది ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన స్టెయిన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత స్టెయిన్‌ను ఆర్‌సీబీ రిలీజ్ చేయగా.. అతను వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకొని దూరంగా ఉన్నాడు.
చదవండి: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు
Comments
Please login to add a commentAdd a comment