4 గంటల 49 నిమిషాల పోరులో క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ సంచలన విజయం
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం పెను సంచలనం నమోదైంది. గత ఏడాది రన్నరప్, ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. అమెరికాకు చెందిన 19 ఏళ్ల క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ అసాధారణ పోరాటపటిమ కనబరిచి మెద్వెదెవ్‌ను ఓడించి తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయం సాధించాడు.
4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ 119వ ర్యాంకర్ లెర్నర్ టియెన్ 6–3, 7–6 (7/4), 6–7 (8/10), 1–6, 7–6 (10/7)తో ఐదో సీడ్, గతంలో మూడుసార్లు రన్నరప్‌గా (2021, 2022, 2024) నిలిచిన మెద్వెదెవ్‌పై గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో మెద్వెదెవ్ 20 ఏస్‌లు సంధించినా... 9 డబుల్ ఫాల్ట్‌లు, 82 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. గత మూడేళ్లు యూఎస్ ఓపెన్‌లో ఆడిన లెర్నర్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.
మొదటిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన లెర్నర్ టియెన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఐదు సెట్‌లు ఆడి నెగ్గడం విశేషం. కామిలో కారాబెల్లి (అర్జెంటీనా)తో 3 గంటల 56 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్‌లో లెర్నర్ టియెన్ 4–6, 7–6 (7/3), 6–3, 5–7, 6–4తో గెలుపొందాడు.
మరోవైపు కాసిదిత్ సామ్‌రెజ్ (థాయ్‌లాండ్)తో 3 గంటల 8 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6–2, 4–6, 3–6, 6–1, 6–2తో గట్టెక్కాడు. రెండో రౌండ్‌లోనూ మెద్వెదెవ్ ఐదు సెట్‌లు పోరాడినా అమెరికన్ టీనేజర్ ఆటతీరుకు చేతులెత్తేశాడు. లెర్నర్, మెద్వెదెవ్ మ్యాచ్ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం తెల్లవారుజాము 2 గంటల 53 నిమిషాలకు ముగియడం గమనార్హం.
మూడో రౌండ్‌లో సినెర్
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో సినెర్ 2 గంటల 46 నిమిషాల్లో 4–6, 6–4, 6–1, 6–3తో స్కూల్‌కేట్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ పావోలిని (ఇటలీ), ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా), తొమ్మిదో సీడ్ కసత్‌కినా (రష్యా), పదో సీడ్ కొలిన్స్ (అమెరికా) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.
రిత్విక్ జోడీ ఓటమి
తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత ప్లేయర్, హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీకి నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో రిత్విక్ (భారత్)–సెగర్‌మన్ (అమెరికా) జోడీ 6–7 (5/7), 1–6తో ఆరో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్‌లాండ్)–హెనీ ప్యాటెన్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది.
శ్రీరామ్ బాలాజీ (భారత్)–వరేలా (మెక్సికో) ద్వయం రెండో రౌండ్‌కు చేరగా... జీవన్ నెడుంజెళియన్– విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)... అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–ద్రజెవ్‌స్కీ (పోలాండ్) జోడీలు తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment