ముగిసిన వార్నర్‌ శకం.. ఎన్నో అద్బుతాలు! అదొక్కటే మాయని మచ్చ? | David Warner earns fitting farewell as Australia complete clean sweep | Sakshi
Sakshi News home page

#David Warner: ముగిసిన వార్నర్‌ శకం.. ఎన్నో అద్బుతాలు! అదొక్కటే మాయని మచ్చ?

Published Sat, Jan 6 2024 9:32 AM | Last Updated on Sat, Jan 6 2024 9:52 AM

David Warner earns fitting farewell as Australia complete clean sweep - Sakshi

ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టెస్టులకు విడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్టు అనంతరం రెడ్‌బాల్‌ క్రికెట్‌ నుంచి డేవిడ్‌ భాయ్‌ తప్పుకున్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా వార్నర్‌ బ్యాటింగ్‌ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది.

పాకిస్తాన్‌ ఆటగాళ్ల సైతం వార్నర్‌కు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చారు. ఇక మూడో టెస్టులో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ చిత్తు చేసింది. ఈ విజయంతో వార్నర్‌కు ఆసీస్‌ ఘనమైన విడ్కోలు పలికింది. తన చివరి టెస్టు ఇన్నింగ్స్‌ను వార్నర్‌ హాఫ్‌ సెంచరీతో ముగించాడు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. 

కివీస్‌తో మొదలెట్టి పాక్‌తో ముగింపు..
2011లో న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్‌.. 13 ఏళ్ల పాటు తన సేవలను ఆస్ట్రేలియా క్రికెట్‌కు అందించాడు. తన ఈ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజయాల్లో డేవిడ్‌ భాయ్‌ భాగమయ్యాడు.  ఓపెనర్‌గా ఎన్నో చిర్మసరణీయ విజయాలను కంగరూలకు అందించాడు. ఫార్మాట్‌ ఏదైనా వార్నర్‌ క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి.

అటువంటి విధ్వంసకర ఆటగాడు తప్పుకోవడం నిజంగా క్రికెట్‌ ఆస్ట్రేలియాకు తీరని లోటు అనే చెప్పాలి. తన టెస్టు కెరీర్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 26 సెంచరీలు, 3 డబుల్‌ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి.

మాయని మచ్చలా..
అయితే వార్నర్‌కు తన అద్భుత కెరీర్‌లో బాల్‌టాంపరింగ్‌ వివాదం మాత్రం ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు 2018 మార్చిలో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ స‌మ‌యంలో ఆసీస్‌ ఆటగాడు కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్ సాండ్‌పేప‌ర్‌తో బంతిని రుద్దుతూ కెమెరా కంట ప‌డ్డాడు.

బాల్ ట్యాంప‌రింగ్ చేసి బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నించిన అత‌డిపై విచార‌ణ జ‌ర‌ప‌గా.. అందులో వార్న‌ర్ హ‌స్తం ఉంద‌ని తేలింది. దాంతో వార్నర్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేదం విధించింది. తర్వాత అతడిపై బ్యాన్‌ ఎత్తివేసినప్పటికీ.. ఆ వివాదం ఓ పీడకలలా మిగిలిపోయింది. కాగా వార్నర్‌ టెస్టులతో పాటు వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇకపై టీ20ల్లో మాత్రమే వార్నర్‌ ఆడనున్నాడు.
చదవండి: AUS vs PAK 3rd Test: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఆసీస్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement