ఢిల్లీ అలవోకగా... | Delhi Capitals beat Gujarat by six wickets in wpl | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అలవోకగా...

Published Wed, Feb 26 2025 3:50 AM | Last Updated on Wed, Feb 26 2025 3:50 AM

Delhi Capitals beat Gujarat by six wickets in wpl

ఆరు వికెట్లతో గుజరాత్‌పై విజయం

బంతితో మెరిసిన మరిజాన్, శిఖా

అదరగొట్టిన జొనాసెన్, షఫాలీ  

బెంగళూరు: ఈ సీజన్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలకడైన విజయాలతో దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన పోరులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా గుజరాత్‌ నిర్ణీ త 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. భారతి ఫుల్మాలి (29 బంతుల్లో 40 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును ఆదుకుంది.

డాటిన్‌ (24 బంతుల్లో 26; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. మరిజాన్‌ కాప్, శిఖా పాండే, అనాబెల్‌ సదర్లాండ్‌ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 15.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెస్‌ జొనాసెన్‌ (32 బంతుల్లో 61 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షఫాలీ వర్మ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు.   

ఆరంభంలోనే దెబ్బ... 
మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జట్టులో బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేశారు. నాలుగో ఓవర్లో హర్లీన్‌ (5), లిచ్‌ఫీల్డ్‌ (0)లను అవుట్‌ చేసిన మరిజాన్‌ కాప్‌ దెబ్బ తీసింది. మరుసటి ఓవర్లో శిఖాపాండే వరుస బంతుల్లో బెథ్‌ మూని (10), కాశ్వీ గౌతమ్‌ (0)లను అవుట్‌ చేయడంతో ఇరవై పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది.

కాసేపటికి కెప్టెన్‌ ఆష్లీ గార్డ్‌నర్‌ (3), డియాండ్ర డాటిన్‌లు స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో 60/6 వద్ద గుజరాత్‌ కుదేలైంది. ఈ దశలో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ భారతి, తనూజ (16) ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో స్కోరు 100 దాటింది.  

ధనాధన్‌... 
సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే కెప్టెన్‌ మెగ్‌లానింగ్‌ (3) వికెట్‌ను కోల్పోయింది. స్టార్‌ బ్యాటర్‌ను అవుట్‌ చేశామన్న ఆనందం గుజరాత్‌కు ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్‌ షఫాలీ వర్మ, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెస్‌ జొనాసెన్‌ ధాటిగా ఆడటంతో పరుగులు వేగంగా వచ్చాయి. జెస్‌ బౌండరీలతో అలరించగా, షఫాలీ భారీ సిక్సర్లతో అదరగొట్టింది. 

వీరిద్దరు 31 బంతుల్లోనే 74 పరుగులు జత చేశారు. షఫాలీ జోరుకు గార్డ్‌నర్‌ అడ్డుకట్ట వేయగా, జెమీమా (5), అనాబెల్‌ (1) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించినా... 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న జొనాసెన్‌ మిగతా లాంఛనాన్ని చకచకా పూర్తి చేసింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై ఇండియన్స్‌ ఆడుతుంది. 

స్కోరు వివరాలు 
గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: బెత్‌ మూనీ (సి) నికీ (బి) శిఖా పాండే 10; హర్లీన్‌ డియోల్‌ (సి) బ్రైస్‌ (బి) మరిజాన్‌ కాప్‌ 5; లిచ్‌ఫీల్డ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మరిజాన్‌ కాప్‌ 0; ఆష్లీ గార్డ్‌నర్‌ (బి) టిటాస్‌ సాధు 3; కాశ్వీ (సి) నికీ (బి) శిఖా పాండే 0; డియాండ్రా (బి) అనాబెల్‌ 26; తనూజ (రనౌట్‌) 16; భారతి (నాటౌట్‌) 36; సిమ్రన్‌ (సి) లానింగ్‌ (బి) అనాబెల్‌ 5; మేఘన (బి) జెస్‌ జొనాసెన్‌ 0; ప్రియా మిశ్రా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–20, 4–20, 5–41, 6–60, 7–111, 8–121, 9–122. బౌలింగ్‌: శిఖా పాండే 3–0–18–2, మరిజాన్‌ కాప్‌ 4–1–17–2, టిటాస్‌ సాధు 2–0–15–1, అనాబెల్‌ 4–0–20–2, మిన్ను మణి 4–0–21–0, జెస్‌ జొనాసెన్‌ 3–0–24–1.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: మెగ్‌ లానింగ్‌ (బి) కాశ్వీ 3; షఫాలీ వర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) గార్డ్‌నర్‌ 44; జెస్‌ జొనాసెన్‌ (నాటౌట్‌) 61; జెమీమా (సి) భారతి (బి) తనూజ 5; అనాబెల్‌ (సి) బెత్‌ మూనీ (బి) కాశ్వీ 1; మరిజాన్‌ కాప్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.1 ఓవర్లలో 4 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–14, 2–88, 3–114, 4–115. బౌలింగ్‌: డియాండ్ర 4–0–30–0, కాశ్వీ 4–0–26–2, ఆష్లీ గార్డ్‌నర్‌ 3–0–33–1, మేఘన 1–0–8–0, ప్రియా 1.1–0–18–0, తనూజ 2–0–13–1.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement