దుబాయ్: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో దుమ్ములేపిన ఢిల్లీ.. ఆపై బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకుని విజయకేతనం ఎగురవేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడా నాలుగు వికెట్లు సాధించగా, అక్షర్ పటేల్, నోర్త్‌జేలు తలో రెండు వికెట్లు తీశారు. అశ్విన్‌కు వికెట్ లభించింది. మ్యాచ్ ఆద్యంతం కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో ఆర్సీబీ పరుగులు చేయడానికి కష్టమైంది. ఆర్సీబీ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి(43; 39 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఢిల్లీ నిర్దేశించిన 197 పరుగుల టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఏ దశలోనూ సరైన భాగస్వామ్యం నెలకొల్పలేకపోవడంతో ఆర్సీబీకి దారుణమైన ఓటమి తప్పలేదు. ఆర్సీబీ 27 పరుగులకే ఓపెనర్లు దేవదూత్ పడిక్కల్(4), అరోన్ ఫించ్(13)లు పెవిలియన్ చేరారు. అనంతరం ఏబీ డివిలియర్స్(9) కూడా నిరాశపరిచాడు. కాగా, కోహ్లి ఆకట్టుకున్నా మరొక ఎండ్‌లో సహకారం లభించకపోవడంతో ఆర్సీబీ 19 ఓవర్లలోనే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరింది. ఇది ఢిల్లీకి నాల్గో విజయం కాగా, ఆర్సీబీకి రెండో ఓటమి.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. పృథ్వీషా(42;23 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లు), శిఖర్ ధావన్(32; 28 బంతుల్లో 3 ఫోర్లు), స్టోయినిస్( 53 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్ పంత్(37; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్)లు రాణించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. స్టోయినిస్ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ మంచి స్కోరును బోర్డుపై ఉంచింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు సాధించగా మొయిన్ అలీ, ఉదానాకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment