కొలొంబో: శ్రీలంకతో బుధవారం జరిగిన రెండో టీ20 ద్వారా టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన దేవ్‌దత్ పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోని భారత క్రికెటర్లలో ఈ శతాబ్దంలో పుట్టిన ఏకైక క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. భారత టెస్ట్, వన్డే, టీ20 జట్లలో ప్రస్తుతం కొనసాతున్న క్రికెటర్లంతా 1999 లేదా అంతకంటే ముందు పుట్టిన వాళ్లే కాగా, కేవలం పడిక్కల్ మాత్రమే ఈ శతాబ్దంలో జన్మించాడు. కర్ణాటకకు చెందిన పడిక్కల్ 2000 జులై 7న జన్మించాడు. కేవలం 21 ఏళ్ల వయసులో అతనికి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది.
టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కోవిడ్ సోకడంతో అతడితో పాటు మరో ఎనిమిది మంది క్రికెటర్లు ఐసోలేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో పడిక్కల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్. చేతన్ సకారియా, నితీశ్ రాణాలకు అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. పడిక్కల్ 23 బంతుల్లో 29 పరుగులు చేసి హసరంగ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆతిధ్య జట్టు.. భారత బౌలర్లు ప్రతిఘటించడంతో అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకోగలిగింది.
ఇదిలా ఉంటే, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో తొలిసారిగా పడిక్కల్ ప్రతిభ అందరికీ తెలిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన పడిక్కల్.. ఆ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి 473 పరుగులు చేశాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో కూడా పడిక్కల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో పడిక్కల్ ఆరు మ్యాచ్‌లలో 195 పరుగులు చేశాడు. ఇందులో ఒక అద్భుతమైన సెంచరీ కూడా ఉంది. కాగా, సీనియర్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో పడిక్కల్‌కు అనూహ్యంగా శ్రీలంక పర్యటనకు పిలుపు అందింది. వన్డే సిరీస్‌తో పాటు తొలి టీ20లో బెంచ్‌కే పరిమితం అయిన పడిక్కల్.. ఎట్టకేలకు రెండో టీ20 ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment