దుబాయ్: సీఎస్‌కే కెప్టెన్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. అతనొక అసాధారణమైన క్రికెటర్ అంటూ గావస్కర్ కొనియాడాడు. ధోని ఒక ఆకర్షణీయమైన క్రికెటర్ అని పేర్కొన్నాడు. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించిన తర్వాత గావస్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘ నా ముఖంపై నవ్వులు తీసుకొచ్చే ఆటగాడు ధోని. అతను చాలా ఆకర్షణీయమైన క్రికెటర్. అతను ఆడుతుంటే బ్యాటింగ్‌లో చాలా వినోదాన్ని తీసుకొస్తాడు. వికెట్ కీపింగ్ చేస్తుంటే ప్రత్యేకంగా ఉంటాడు. ఇక నాయకత్వ లక్షణాలతో మరిపిస్తాడు. ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్‌లో అతని ప్రవర్తన కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. ధోని ఒక రోల్ మోడల్. మనం మరింత మెరుగైన ధోనిని వచ్చే ఐపీఎల్ చూస్తాం’ అని పేర్కొన్నాడు.(ఎంఎస్ ధోని తొలిసారి..)
ఇక్కడ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో తాను ఆడతాననే సంకేతాలివ్వడాన్ని గావస్కర్ స్వాగతించాడు. అదొక మంచి పరిణామం అని పేర్కొన్నాడు. ధోనిలో ఇంకా చాలా క్రికెట్ ఉందన్నాడు. కాకపోతే కొన్ని విషయాలపై ధోని ఫోకస్ చేయాలన్నాడు. ప్రధానంగా దేశవాళీ క్రికెట్ ఆడితే ధోనికి మరింత లాభిస్తుందని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.‘కాంపిటేటివ్ క్రికెట్ అనేది ధోనికి ఇప్పుడు చాలా ముఖ్యమైనది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం కంటే నేరుగా మ్యాచ్‌లు ఆడితే మంచిది. నెట్స్‌లో ఒత్తిడి ఉండదు. అదే మ్యాచ్‌ల్లో అయితే ఒత్తిడి ఉంటుంది. ఒకవేళ ధోని దేశవాళీ క్రికెట్ ఆడితే మాత్రం వచ్చే ఐపీఎల్‌లో 400 పరుగులు చేయగలడు’ అని గావస్కర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment