అత‌డే మా కొంప‌ముంచాడు.. మేము అనుకున్న‌ది జ‌ర‌గలేదు: రోహిత్‌ శర్మ | Disappointed Rohit Sharma Rues on Lack of Consistency in 2nd ODI vs SL | Sakshi
Sakshi News home page

అత‌డే మా కొంప‌ముంచాడు.. మేము అనుకున్న‌ది జ‌ర‌గలేదు: రోహిత్‌ శర్మ

Published Mon, Aug 5 2024 9:09 AM | Last Updated on Mon, Aug 5 2024 10:58 AM

Disappointed Rohit Sharma Rues on Lack of Consistency in 2nd ODI vs SL

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈజీగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయి టీమిండియా ఓట‌మి చ‌విచూసింది. మ‌రోసారి స్పిన్ వ‌ల‌లో భార‌త్ చిక్కుకుంది.

ఈ మ్యాచ్‌లో ఏకంగా 9 మంది భార‌త బ్యాట‌ర్లు స్పిన్న‌ర్ల‌కే త‌మ వికెట్లు స‌మ‌ర్పించుకున్నారు. రోహిత్ శ‌ర్మ‌, శుబ్‌మ‌న్ గిల్ అద్భుత‌మైన ఆరంభమిచ్చిన‌ప్ప‌ట‌కి.. మిడిలార్డ‌ర్ మాత్రం పేక మేడ‌లా కుప్ప‌కూలింది. 241 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌లో 208 ప‌రుగుల‌కే టీమిండియా ఆలౌటైంది. 

లంక బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ జెఫ్రీ వాండర్సే 6 వికెట్ల‌తో టీమిండియా ప‌తనాన్ని శాసించాడు. ఇక ఈ ఓట‌మి పై మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందించాడు. పేల‌వ బ్యాటింగ్ కార‌ణంగా తాము ఓడిపోయామ‌ని రోహిత్ శర్మ అంగీకరించాడు.

అత‌డి వ‌ల్లే ఓడిపోయాం: రోహిత్‌
"మ్యాచ్ ఓడినప్పుడు ప్రతీది మ‌నల్ని భాదిస్తుంది. నేను చెబుతున్న‌ది కేవ‌లం ఆఖ‌రి 10 ఓవ‌ర్లకు సంబంధించి మాత్రమే కాదు. ప్రతీ మ్యాచ్‌లో నిలక‌డగా ఆడ‌డం చాలా ముఖ్యం. గ‌త కొన్ని మ్యాచ్‌ల్లో ఆలానే ఆడుతున్నాం. కానీ దుర‌దృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో మేము సమిష్టగా విఫలమయ్యాం. 

ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ క్రికెట్‌లో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. మనముందు సవాళ్లను స్వీకరించేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలి. స్పిన్నర్లకు లెఫ్ట్‌-రైట్ కాంబనేషన్‌లలో స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం ఈజీగా ఉంటుందని భావించాము. అందుకే దూబేను ముందుగా బ్యాటింగ్ పంపించాము. 

కానీ జెఫ్రీ మాత్రం మా వ్యూహాలను దెబ్బతీశాడు. 6 వికెట్ల పడగొట్టి మ్యాచ్‌ను మా నుంచి లాగేసాడు. కచ్చితంగా అతడికి ‍క్రెడిట్ ఇవ్వాల్సిందే. నేను దూకుడుగా ఆడ‌టం వ‌ల్లే 65 ప‌రుగులు చేయ‌గ‌లిగాను. నా బ్యాటింగ్‌లో చాలా రిస్క్ షాట్‌లు ఉంటాయి. 

ఆ ప్ర‌య‌త్నంలో తొంద‌ర‌గా వికెట్ కోల్పోతే నిరాశ‌కు లోన‌వ‌తాను. ఏదమైన‌ప్ప‌ట‌కి ప‌వ‌ర్‌ప్లేలో దాటిగా ఆడి పరుగులు రాబ‌ట్ట‌డ‌మే నా ఉద్దేశ్యం. ఈ పిచ్ స్వభావం మేం అర్థం చేసుకున్నాం. మిడిల్ ఓవర్లలో ఈ వికెట్‌పై ఆడటం చాలా కష్టం. తొలి పవర్ ప్లేలోనే వీలైనన్ని పరుగులు చేయాలి. 

ఈ రోజు మేము అది చేయ‌లేక‌పోయాం. అయితే ఈ ఓట‌మిని పెద్ద‌గా చూడాల్సిన అవ‌స‌రం లేదు. కానీ మిడిల్ ఓవర్లలో మా బ్యాటింగ్ తీరుపై చ‌ర్చించాల్సిన అవ‌స‌రముందని" పోస్ట్ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement