India tour of West Indies, 2023 - T20 Series: ‘‘ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇది ఐదు మ్యాచ్‌ల సిరీస్. టీ20 ఫార్మాట్ అంటేనే అలా ఉంటుంది. నిమిషాల వ్యవధిలో అంతా తారుమారవుతుంది. తప్పక గెలుస్తామనుకున్న మ్యాచ్ కూడా ఓడిపోయే సందర్భాలు ఉంటాయి. విండీస్‌తో తొలి టీ20 కూడా అలాంటిదే!
విజయానికి చేరువగా వచ్చి కొద్దిలో మిస్ అయ్యాం. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇంతకంటే గొప్పగా ఏమీ చేయలేరు’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెస్టిండీస్‌తో రెండో టీ20లో హార్దిక్ సేన పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా ఆడితే అంతా సర్దుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తృటిలో చేజారిన మ్యాచ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.
కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టీ20లో 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అరంగేట్ర బ్యాటర్ తిలక్ వర్మ(39) మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో లక్ష్య ఛేదనలో హార్దిక్ సేన తడబడింది. సూర్యకుమార్ యాదవ్ వంటి నంబర్ 1 టీ20 బ్యాటర్ జట్టులో ఉన్నప్పటికీ 150 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయలేక చతికిలపడింది. ఫలితంగా గురువారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య కరేబియన్ జట్టు చేతిలో ఓటమి తప్పలేదు.
ఈ క్రమంలో ఆదివారం గయానా వేదికగా జరుగనున్న రెండో టీ20లో భారత జట్టు సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. పిచ్ స్వభావంపైనే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. టీమిండియా బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు రాణిస్తే.. విండీస్‌ను ఓడించడం కష్టమేమీ కాదన్నాడు. ఇదిలా ఉంటే.. విండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-0తో గెలిచిన భారత జట్టు.. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: వారణాసి అమ్మాయి.. వెస్టిండీస్ క్రికెటర్ భార్య! భోజ్‌పురీలో మాట్లాడగలదు.. ఇంకా!
విండీస్‌తో రెండో టీ20.. శుబ్‌మన్ గిల్‌పై వేటు! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment